గిరిజన గ్రామాల అభివృద్ధికి ‘ఆరు సూత్రాల’ ప్రణాళిక
- పిట్టబొంగారంలో అభివృద్ధి పనులకు శ్రీకారం.. కలెక్టర్ రాజర్షి షా
ఇంద్రవెల్లి, ఆగస్టు 14 (ఆంధ్రప్రభ): గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ప్రతి గిరిజన గ్రామం మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం, వ్యవసాయాభివృద్ధి, మహిళా సాధికారతతో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు.
ఇంద్రవెల్లి మండలంలోని మారుమూల పిట్టబొంగారం గ్రామంలో శుక్రవారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఐటీడీఏ పీవో మంద మకరంద్తో కలిసి జిల్లా కలెక్టర్ పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్మించనున్న పలు మౌలిక వసతులకు శ్రీకారం చుట్టారు.
గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నూతన ప్రహరీ గోడ, పర్ధాన్ కమ్యూనిటీ హాల్, నూతన గ్రామపంచాయతీ భవనం, కొత్తగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గిరిజన గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం ఐటీడీఏ, జిల్లా యంత్రాంగం కలిసి ‘ఆరు సూత్రాల అభివృద్ధి ప్రణాళిక’ను అమలు చేస్తున్నాయని తెలిపారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా శాఖల మధ్య సమన్వయంతో పనిచేస్తున్నామని చెప్పారు.
గిరిజన ప్రాంతాల్లో మాతా–శిశు మరణాలను పూర్తిగా తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. ప్రతి గర్భిణి రిమ్స్ ఆసుపత్రిలో టిఫా స్కాన్ చేయించుకోవాలని సూచించారు. గర్భిణుల ఆరోగ్యంపై ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు.
గిరిజన విద్యార్థులు పోటీ ప్రపంచంలో రాణించేలా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచుతున్నామని చెప్పారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఎఫ్ఎల్ఎన్, ఆరు నుంచి పదో తరగతి వరకు ఎల్ఐపీ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా సమస్యలను పరిష్కరించి మెరుగైన విద్యా వాతావరణం కల్పిస్తామని పేర్కొన్నారు.
వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు జలసిరి పథకం ద్వారా రైతులు తమ పొలాల్లో వ్యవసాయ కుంటలు ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ పథకం కింద రూ.90 వేల నుంచి రూ.1.30 లక్షల వరకు ఆర్థిక సహాయం నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతుందని తెలిపారు. లావుని పట్టా భూములకు సంబంధించి బ్యాంకు రుణాల సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
డ్వాక్రా మహిళలకు బ్యాంకు లింకేజీల ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కొత్త పింఛన్ల కోసం ఈ నెల 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నందున అర్హులు వినియోగించుకోవాలని సూచించారు.
ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. మారుమూల గిరిజన గ్రామాలకు పట్టణాలకు దీటుగా మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పీహెచ్సీ ప్రహరీ గోడ, కమ్యూనిటీ హాల్ గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు.
ఐటీడీఏ పీవో మాట్లాడుతూ.. గిరిజన ప్రజల సంక్షేమానికి ఐటీడీఏ ద్వారా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వివరించారు.
ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శంకర్, సర్పంచ్ మాదవి ఇంద్రదేవ్, స్థానిక ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శి వనిత, ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
