మోడల్ గ్రంథాలయంగా తీర్చిదిద్దాలి
- త్వరలోనే రీడర్స్ కు అందుబాటులోకి రానున్న గ్రంథాలయం
- గ్రంధాలయం నిర్మాణ పనులు పునః ప్రారంభంలో ఎమ్మెల్యే
నర్సాపురం, ఆంధ్రప్రభ: పట్టణ నడిబొడ్డున నిర్మాణ తలపెట్టిన గ్రంథాలయం ను మోడల్ గ్రంథాలయంగా తీర్చి దిద్దాలని, త్వరితగతిన పనులు పూర్తి చేసి రీడర్స్ కు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అధికారులను ఆదేశించారు.నరసాపురం పట్టణంలోని కాటన్ పార్క్లో శుక్రవారం నిర్వహించిన నరసాపురం ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయ భవన పునః నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో గ్రంథాలయ భవన నిర్మాణ పనులు ప్రారంభించినప్పటికీ, వాటిని మధ్యలోనే నిలిపివేశారన్నారు. అసంపూర్తి పనులువల్ల ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కుంటూన్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో గ్రంథాలయం నిర్మాణ పనులు నిర్లక్ష్యానికి గురయ్యాయని చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ను దృష్టిలో పెట్టుకొని ఆధునిక వసతులతో ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని గ్రంథాలయ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అభివృద్ధిపై గత ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించిందని విమర్శించారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజలకు ఉపయోగపడే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. గ్రంథాలయ భవన నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేసి, త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. డిసిఎంఎస్ చైర్మన్ చాగంటి మురళికృష్ణ మాట్లాడుతూ నర్సాపురం గ్రంథాలయానికి విశిష్ట చరిత్ర ఉందని, ఎంతో మంది పేద విద్యార్థులకు చదువుల కోవెలగా ఉందని, ఇక్కడ చదువుకొని ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని తెలిపారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయాల చైర్మన్ జుత్తిగ నాగరాజు మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ జిల్లా లోని గ్రంథాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వ ప్రోత్సాహం ఆనంద దాయకం అన్నారు. నర్సాపురం లో అసంపూర్తిగా నిలిచిన నిర్మాణ పనులు పునః ప్రారంభం కావడానికి ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ చేసిన కృషి ఎనలేనిది అని కొనియాడారు. ఉభయ గోదావరి జిల్లాల గ్రంథాలయ శాఖ కార్యదర్శి కే జే ఎస్ ఎల్ కుమారి కృషి కూడా చాలా ఉందని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో రీడర్స్ ఫారం సభ్యులు, గ్రంధాలయం అభివృద్ధి కమిటీ సభ్యులు, పాఠకులు, పుస్తక అభిమానులు,జనసేన, టిడిపి, బిజేపి నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, జనసైనికులు , గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.
