అభివృద్ధికి కేరాఫ్ కూటమి ప్రభుత్వం
- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
- రూ.11 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం..
- రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో: గత ప్రభుత్వ పాలనలో రాష్ట్ర అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పథంలో పయనిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.
శుక్రవారం గార మండలం, శ్రీకాకుళం నగర పరిధిలో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి కేంద్ర మంత్రి పర్యటించారు. సుమారు రూ.11 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
తొలుత గార మండల కేంద్రంలో రూ.2.55 కోట్ల ప్రత్యేక నిధులతో నిర్మించిన కళింగపట్నం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. అనంతరం వమరవల్లి వరకు నిర్వహించిన తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. వమరవల్లిలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
అనంతరం శ్రీకాకుళం నగరంలోని మహాలక్ష్మీనగర్‌లో రూ.2.60 కోట్ల వ్యయంతో నిర్మించనున్న విద్యుత్ సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. ప్రధాన మార్కెట్–మెదరవీధి వద్ద రూ.52 లక్షలతో నిర్మించిన సీసీ రహదారిని ప్రారంభించారు. ఏడు రోడ్ల జంక్షన్ వద్ద రూ.56 లక్షలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌ను ప్రారంభించారు.
నగరంలోని కృష్ణ పార్కు వద్ద కల్వర్టు, డే అండ్ నైట్ జంక్షన్ వద్ద రూ.2.90 కోట్లతో నిర్మించిన సెంట్రల్ డివైడర్, రూ.1.75 కోట్లతో నిర్మించిన నీటిపారుదల శాఖ ఈఈ కార్యాలయం, వరం కాలనీలో సీసీ డ్రైన్లు, సీసీ రోడ్డు పనులను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. గార మండలంతో తన తండ్రికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ రోజు కార్యక్రమానికి తామొక్కరమే రాలేదని, సాగునీటిని కూడా తీసుకొచ్చామని చెప్పడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారన్నారు.
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని తెలిపారు. రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించిన అనేక అభివృద్ధి పనులు వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురయ్యాయని, వాటిని తిరిగి కూటమి ప్రభుత్వం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తోందని పేర్కొన్నారు.
గార–పోలాకి బ్రిడ్జికి గతంలో తమ ప్రభుత్వం శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిందని, ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయి నిర్మాణ వ్యయం పెరిగిందని తెలిపారు. తిరిగి కూటమి ప్రభుత్వం హయాంలోనే ఈ పనులను పూర్తి చేస్తామని చెప్పారు.
సూపర్ సిక్స్ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. మంత్రి నారా లోకేష్ కృషితో రాష్ట్రానికి రూ.11 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, తద్వారా భారీగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని అన్నారు.
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్ణీత గడువుకంటే ముందే పూర్తి చేసి ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. భోగాపురం విమానాశ్రయం కేవలం భవన సముదాయం కాదని, ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు ప్రతీక అని పేర్కొన్నారు.
మూలపేట పోర్టు, రూ.641 కోట్లతో చేపట్టిన నేరడి ప్రాజెక్టు వంటి దీర్ఘకాల ప్రయోజనాలున్న ప్రాజెక్టులు త్వరలోనే జిల్లాకు మంచి ఫలితాలు అందిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఆర్డీవో సాయి ప్రత్యూష, వంశధార ప్రాజెక్టు కమిటీ చైర్మన్ అరవల రవీంద్ర, పలువురు అధికారులు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
