శ్రావణ భక్తితో పులకించిన దుర్గగుడి

  • సువర్ణ శోభితంగా పుష్పాలంకరణ
  • శ్రావణమాస ఉత్సవాలకు వైభవంగా శ్రీకారం
  • అమ్మవారి సన్నిధిలో విశేష కుంకుమార్చనలు
  • కనకదుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తజనం
  • భక్తుల సౌకర్యాలపై ఈఓ శీనా నాయక్‌ ప్రత్యేక పర్యవేక్షణ

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: శ్రావణమాస తొలి శుక్రవారం సందర్భంగా ఇంద్రకీలాద్రి భక్తి పారవశ్యంతో పులకించింది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శ్రావణమాస ఉత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలిరావడంతో ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్లలో వేచి ఉండి శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రావణ శుక్రవారం విశిష్టతను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, విశేష కుంకుమార్చనలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు కుంకుమార్చనల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహంతో సౌభాగ్యం, కుటుంబ క్షేమం కలగాలని ప్రార్థించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలతో ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

సర్వాంగ సుందరంగా..

ఆలయ ప్రాంగణాన్ని శ్రావణమాస తొలి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రధాన ఆలయంలోని మూలవిరాట్‌, ఉపాలయాలు, అంతరాలయాలను రంగురంగుల సుగంధభరిత పుష్పాలతో అలంకరించడంతో ఆలయానికి కొత్త శోభ సంతరించుకుంది. పుష్పాలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ కార్యనిర్వహణాధికారి శీనా నాయక్‌ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. స్కానింగ్‌ పాయింట్ల వద్ద భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా క్యూ లైన్లు వేగంగా కదిలేలా సిబ్బందికి సూచనలు చేశారు.

ఆలయ పవిత్రతను కాపాడటంలో భాగంగా మొబైల్‌ ఫోన్లను లోపలికి తీసుకెళ్లకుండా భద్రతా సిబ్బందితో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు మంచినీరు, పాలు వంటి కనీస సౌకర్యాలు అందుబాటులో ఉంచారు. అధికారులు, అర్చకులు, భద్రతా సిబ్బంది సమన్వయంతో భక్తులకు ప్రశాంతంగా, సులభంగా అమ్మవారి దర్శనం కల్పించేలా చర్యలు చేపట్టారు. శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భక్తి, ఆధ్యాత్మికత వెల్లివిరియగా.. అమ్మవారి నామస్మరణతో కొండ మార్మోగింది.