డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి

విద్యార్థినులకు ఈగల్ విభాగం అవగాహన

ఏలూరు టౌన్, ఆంధ్రప్రభ: మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించేందుకు ఏలూరు జిల్లా ఈగల్ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ, ఐపీఎస్, ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు పెదపాడు మండలం వట్లూరులోని పీఎం శ్రీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలలో శుక్రవారం మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈగల్ విభాగం ఆర్‌ఎస్‌ఐ బి. ఉదయభాస్కర్ మాట్లాడుతూ.. డ్రగ్స్‌కు ఎలా దూరంగా ఉండాలి, వాటి వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక, ఆరోగ్యపరమైన నష్టాల గురించి విద్యార్థినులకు వివరించారు. మాదకద్రవ్యాల వినియోగం, నిల్వ, రవాణా, విక్రయాలకు సంబంధించి ఎన్‌డీపీఎస్ చట్టంలోని నిబంధనలు, నేరాలకు పాల్పడితే ఎదురయ్యే చట్టపరమైన పరిణామాలపై అవగాహన కల్పించారు.

అనంతరం విద్యార్థినులతో డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ నిర్వహించి, మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే ఈగల్ టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ 1972 లేదా అత్యవసర పోలీస్ హెల్ప్‌లైన్ 112కు సమాచారం అందించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ డి. ఝాన్సీ, ఉపాధ్యాయులు, ఈగల్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.