ప్రతి అర్జీని సవాల్‌గా తీసుకుని పరిష్కరించాలి
- కలెక్టర్ వెట్రిసెల్వి.. దెందులూరులో ప్రత్యేక పీజీఆర్ఎస్
- 57 అర్జీల స్వీకరణ.. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
దెందులూరు, ఆంధ్రప్రభ: ప్రజల నుంచి స్వీకరించే ప్రతి అర్జీని సవాల్‌గా తీసుకుని శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
“ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు పర్యటనలు” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం దెందులూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మూడో విడత ప్రత్యేక పీజీఆర్ఎస్ గ్రామసభను కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు.
కలెక్టర్ వెట్రిసెల్వితో పాటు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 57 అర్జీలు అందాయి.
గతంలో నిర్వహించిన మొదటి, రెండో విడత పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీల పరిష్కార ప్రగతిని శాఖల వారీగా కలెక్టర్ సమీక్షించారు. సమస్యల పరిష్కారంలో వెనుకబడిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ.. ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాలకు జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలన్నారు. స్వీకరించిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించి, నివేదికలు, ఫొటోలతో తదుపరి సమావేశానికి హాజరుకావాలని ఆదేశించారు.
ఒకే సమస్యపై ప్రజలు పదేపదే అర్జీలు ఇవ్వాల్సిన పరిస్థితి రాకుండా చూడాలని, క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి పరిశీలన చేసి ప్రజల్లో సంతృప్తి పెంచేలా అధికారులు పనిచేయాలని సూచించారు.
ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి అర్జీకి నాణ్యమైన పరిష్కారం అందించాలన్నారు. సూపర్ ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.
అర్హులైన రైతులు పంటల బీమా పథకంలో నమోదు అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. 22ఏ భూముల సమస్యలపై అధికంగా అర్జీలు వస్తున్నాయని, వాటిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని కోరారు.
