మా పొలం ముందు డ్రైనేజీ నిర్మాణానికి ఒప్పుకోం
సొంత స్థలంలోనే నిర్మించుకోవాలని రైతుల ఆగ్రహం
విజయవాడ రూరల్,ఆంధ్ర ప్రభ: తమ పొలం నుంచి మురుగు కాలువ నిర్మాణానికి అనుమతించేది లేదని రైతులు స్పష్టం చేశారు. ప్రభుత్వ భూమిలో ఎటువంటి అనుమతులు లేకుండా డ్రైనేజీ నిర్మించడమే కాకుండా తమ స్థలాన్ని ఆక్రమించుకున్నారని మహిళా రైతు కందిమల్ల రాజరాజేశ్వరి దేవి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మండల పరిధిలోని రామవరప్పాడు గ్రామంలోని ఎస్ఎల్వీ విల్లాస్ నుంచి వచ్చే మురుగునీటి కోసం ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా కాలువ నిర్మిస్తున్నారని, అంతేకాకుండా తమ వ్యవసాయ భూమి నుంచి డ్రైనేజీ తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని రైతులు ఆరోపించారు.
రైతుల ఫిర్యాదు మేరకు విజయవాడ రూరల్ మండల తహసీల్దార్ సుగుణ, ఎంపీడీవో పార్థసారథి, సర్వే సిబ్బంది శుక్రవారం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఫిర్యాదుదారులు, డ్రైనేజీ నిర్మిస్తున్న వారి సమక్షంలో సర్వే నిర్వహించగా కొంత భూమి కాలువ నిర్మాణంలోకి వెళ్లినట్లు తహసీల్దార్ సుగుణ గుర్తించారు. దీంతో ఆక్రమణకు గురైన భూమిని రైతులకు అప్పగించాలని ఎంపీడీవో పార్థసారథిని ఆదేశించారు.
ఈ సందర్భంగా రైతులు, ఎస్ఎల్వీ విల్లాస్ నివాసితుల మధ్య కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. తమ పొలం ముందు ప్రభుత్వ భూమిలో డ్రైనేజీ నిర్మించేందుకు ఎవరు అనుమతులు ఇచ్చారని రైతులు ప్రశ్నించారు. గతంలో పలుమార్లు పనులు నిలిపివేయాలని చెప్పినా పట్టించుకోకుండా హడావుడిగా మురుగు కాలువ నిర్మిస్తున్నారని నిలదీశారు.
దీనిపై ఎస్ఎల్వీ విల్లాస్ నివాసితులు స్పందిస్తూ.. పంచాయతీరాజ్ శాఖ జిల్లా అధికారి సూచన మేరకే డ్రైనేజీ నిర్మాణం చేపట్టామని, అనంతరం అనుమతులు తీసుకుంటామని తెలిపినట్లు పేర్కొన్నారు.
అయితే రైతులు మాట్లాడుతూ.. డ్రైనేజీ నిర్మించే ముందు సంబంధిత భూమి యజమానులతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిందని, అనుమతులు లేకుండా తమ భూమిలో కాలువ ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పొలం ముందు నుంచి డ్రైనేజీ నిర్మాణానికి అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఆక్రమించిన భూమిని వెంటనే తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. దీనిపై ఎంపీడీవో పార్థసారథి స్పందిస్తూ.. ఆక్రమణకు గురైన స్థలంలో ఉన్న డ్రైనేజీని తొలగించి రైతుల భూమిని వారికి అప్పగించాలని నిర్మాణదారులకు సూచించారు.
