ఇక ఒక్క రోజే..
ఓటరు జాబితా సవరణకు నేడు తుది గడువు
కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. జూలై 14తో గడువు ముగియనున్న నేపథ్యంలో జిల్లా ఎన్నికల యంత్రాంగం చివరి రోజు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తోంది. అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా, అనర్హుల పేర్లు తొలగించే ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు.
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం తుది దశకు చేరుకోవడంతో అన్ని పోలింగ్ కేంద్రాల్లో బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) అందుబాటులో ఉండి పెండింగ్ పనులను పూర్తిచేసేలా చర్యలు చేపట్టారు. ఇంటింటి సర్వేలో సేకరించిన వివరాల ఆధారంగా అబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్ (ఏఎస్డీ) జాబితాలకు తుది రూపు ఇస్తున్నారు.
మరణించిన, వలస వెళ్లిన, డూప్లికేట్ ఓటర్ల వివరాలను మరోసారి పరిశీలిస్తూ అర్హులైన ఓటర్ల పేర్లు మాత్రమే తుది జాబితాలో ఉండేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఏఎస్డీ ఓటర్ల సంఖ్య అధికంగా ఉన్న పోలింగ్ కేంద్రాల్లో క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తూ వివరాలను ధృవీకరిస్తున్నారు.
ఆన్లైన్ ద్వారా వచ్చిన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్‌ను కూడా వేగంగా పూర్తి చేస్తున్నారు. కర్నూలు, పాణ్యం, ఆదోని, ఎమ్మిగనూరు తదితర నియోజకవర్గాల్లో పెండింగ్‌లో ఉన్న ఆన్లైన్ దరఖాస్తులను అత్యవసరంగా సిస్టమ్‌లో నమోదు చేస్తున్నారు. అలాగే పెండింగ్‌లో ఉన్న ‘బుక్ ఏ కాల్’ అభ్యర్థనలను కూడా ప్రత్యేక బృందాలు పరిష్కరిస్తున్నాయి.
కర్నూలు నగరంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఆకస్మికంగా పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఎన్యూమరేషన్ ఫారాల పరిశీలన, డేటా నమోదు, ఏఎస్డీ జాబితాల తయారీ, అన్‌కలెక్టబుల్ ఓటర్ల వివరాలను సమీక్షించారు. ముఖ్యంగా వలస వెళ్లిన ఓటర్ల విషయంలో తగిన ఆధారాల ఆధారంగానే నిర్ణయాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
జిల్లాలో మొత్తం 20.86 లక్షల మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 96 శాతానికి పైగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయింది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రక్రియ దాదాపు పూర్తికాగా, పట్టణ ప్రాంతాల్లో వలసలు అధికంగా ఉండటంతో నమోదు పనులు కొనసాగుతున్నాయి. మైక్ ప్రచారం, ప్రత్యేక శిబిరాలు, ఫోన్ కాల్స్, వాట్సాప్ ద్వారా ఓటర్లను సంప్రదిస్తూ మిగిలిన వివరాలను సేకరిస్తున్నారు.
జూలై 14తో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో ప్రతి పోలింగ్ కేంద్రంలో పెండింగ్ పనులను పూర్తిచేయడంపై జిల్లా ఎన్నికల యంత్రాంగం దృష్టి సారించింది. అనంతరం జూలై 21న తుది ఓటరు జాబితాను ప్రచురించనున్నారు.
