ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణకు చర్యలు..

అక్టోబర్ నాటికి సీతారామ ప్రాజెక్టు పనులు పూర్తి: డాక్టర్ మట్టా దయానంద్

వేంసూరు, ఆంధ్రప్రభ : ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులకు సాగునీరు అందించేందుకు నియోజకవర్గంలోని ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ తెలిపారు.

ఎన్‌ఎస్‌పీ కాలువ ద్వారా గోదావరి జలాలు మండలానికి చేరుకున్న సందర్భంగా సోమవారం మండల కాంగ్రెస్ పార్టీ, మండల యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పూలాభిషేక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ మట్టా దయానంద్ గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి పసుపు, కుంకుమ, పూలతో అభిషేకం చేశారు.

అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలోని ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణకు అవసరమైన నివేదికను ఒకటి, రెండు రోజుల్లో ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. తరచూ ట్రాన్స్‌ఫార్మర్లు, కాపర్ వైర్లు, ఆయిల్ దొంగతనాలకు గురవుతున్న నేపథ్యంలో వాటి రక్షణకు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు వరి సాగుకు బదులుగా అంతర పంటలు, ఉద్యాన పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు.

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంలో సత్తుపల్లి నియోజకవర్గం రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. దాదాపు ప్రతి గ్రామానికి రూ.10 లక్షలకు పైగా అభివృద్ధి నిధులు మంజూరయ్యాయని చెప్పారు. ఫుడ్ పార్క్ నిర్మాణంతో సుమారు 3 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.

మంత్రి నాగేశ్వరరావు కృషి వల్ల గోదావరి జలాలు ఈ ప్రాంతానికి చేరాయని తెలిపారు. అక్టోబర్ నాటికి సీతారామ ప్రాజెక్టు పనులు పూర్తై గోదావరి నీటిని పూర్తిస్థాయిలో అందించే అవకాశం ఉందన్నారు. వేంసూరు ఎత్తిపోతల పథకాల ద్వారా వారం రోజుల్లో సాగునీటిని విడుదల చేస్తామని చెప్పారు.

జిల్లాలోని ముగ్గురు మంత్రుల సహకారంతో నియోజకవర్గానికి భారీగా అభివృద్ధి నిధులు మంజూరవుతున్నాయని, దీంతో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఉచిత విద్యుత్ అందించడం వల్ల వ్యవసాయ రంగం అభివృద్ధి చెందిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాసర చంద్రశేఖరరెడ్డి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నెల్లూరి రాకేష్, మాజీ రైతుబంధు అధ్యక్షుడు వెల్ది జగన్మోహనరావు, డీసీసీబీ డైరెక్టర్ గొర్ల సంజీవరెడ్డి, మాజీ ఎంపీపీ రాచూరి గంగరాజు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుచ్చకాయల సోమిరెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు గడిపర్తి శ్రీనివాసరావు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు బొమ్మనబోయిన వెంకటేశ్వరరావు, నీటిపారుదల శాఖ డీఈ మరియన్న, నాగేశ్వరరావు, అధికారులు, రైతులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.