నులిపురుగుల నివారణ మాత్రలు తప్పనిసరి: కాటం వెంకటేశం

చిట్యాల, ఆంధ్రప్రభ : ఒకటి నుంచి 13 ఏళ్ల వయస్సు గల చిన్నారులందరికీ నులిపురుగుల నివారణ కోసం ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేయించాలని చిట్యాల మండలం సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, పెద్దకాపర్తి గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం పిలుపునిచ్చారు.

సోమవారం చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేసి వేయించారు.

ఈ సందర్భంగా కాటం వెంకటేశం మాట్లాడుతూ, చిన్నారుల్లో నులిపురుగుల సమస్య వల్ల రక్తహీనత, పోషకాహార లోపం, ఎదుగుదల మందగించడం, చదువుపై ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. అందుకే ప్రభుత్వం ప్రతి ఏడాది జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు.

తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు వేయించి వారి ఆరోగ్యాన్ని కాపాడాలని సూచించారు. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులతో పాటు అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు కూడా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ మాత్రలు అందజేస్తున్నట్లు చెప్పారు.

ఆరోగ్యవంతమైన బాల్యం దేశాభివృద్ధికి పునాదని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఓర్సు సైదులు, ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్, కందిమల్ల యశోద రెడ్డి, ఉపాధ్యాయ బృందం, సూపర్వైజర్ లక్ష్మి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.