మమ్మల్ని గౌరవించండి…మిమ్మల్ని గౌరవిస్తాం
గంపలగూడెం, ఆంధ్రప్రభ : మమ్మల్ని గౌరవించండి..మిమ్మల్ని గౌరవిస్తాం,మీరు మా మండలంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనే సమయంలో పార్టీ మండల,గ్రామ అధ్యక్షులను ఆహ్వానించండి.. అప్పుడు మా కార్యక్రమాలకు కూడా ఆహ్వానిస్తాం అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు,సహకార సంఘం చైర్మన్ చెరుకూరి రాజేశ్వరరావు నియోజకవర్గ శాసనసభ సభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావును ఉద్దేశించి అన్నారు.సోమవారం మండలంలోని ఊటుకూరు గ్రామంలో 99 లక్షల రూపాయలతో పునరుద్ధరణ చేసిన శ్రీ కృష్ణరాయ సహకార సంఘం కళ్యాణ మండపం ప్రారంభోత్సవానికి ఎంపి చిన్నిను,కెడిసిసిబి చైర్మన్ నెట్టెం రఘురాంను రాజేశ్వరరావు ఆహ్వానించారు.
ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యునికి ఆహ్వానం లేదనే విషయాన్ని గమనించిన పార్టీ జిల్లా అదిష్టానం ఎంపి చిన్ని,రఘురాంను పాల్గొనవద్దని ఆదేశం జారీ చేసింది.దీనితో వారు ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు.దీనిని ఉద్దేశించి రాజేశ్వరరావు మాట్లాడుతూ శిలాఫలకంలో అగ్రవర్ణాల నాయకుల పేర్లే ఉన్నాయని ఒక దళిత ఎమ్మెల్యే అయిన నా పేరు లేదని అధిష్టానానికి ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారని అన్నారు. దీనితో అధిష్టానం వారిని పాల్గొనకుండా చేసిందని శ్రేణులకు తెలిపారు.అమరావతి ఉద్యమంలో కీలకంగా ఉన్న శ్రీనివాసరావు నియోజకవర్గానికి మంచి చేస్తారని ఆలోచించి నియోజకవర్గ నాయకులు అందరూ కలిసి అతనికి ఎమ్మెల్యే టికెట్ దక్కేలా కృషి చేశామని అన్నారు.
కానీ ఆయన గెలిచిన నాటి నుండి పార్టీ కోసం కష్టపడిన వారిని వదిలేసి వైకాపా వారితో చేతులు కలపడం,నియోజకవర్గ పార్టీకు నష్టం కలిగించేలా మాట్లాడటం లాంటి కారణాలతోనే విభేదాలు మొదలయ్యాయని అందుచేతనే శిలాఫలకంలో పేరు ముద్రించలేదని ఆయన స్పష్టం చేశారు.మండలంలో ఏ కార్యక్రమానికి వచ్చినా పార్టీ శ్రేణులకు,నాయకులకు చెప్పకుండా వస్తారని అందుచేతనే ఈ ప్రారంభోత్సవానికి మేము కూడా చెప్పలేదని అన్నారు.
పార్టీ అధిష్టానం అన్ని విషయాలను గమనించి,అందరితో మాట్లాడి తిరువూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీను గట్టెక్కించాలని అన్నారు.అదేవిధంగా గ్రామంలో ఆయుష్ ఆస్పటల్ వారి సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన శుద్ధ జల కేంద్రంను ప్రారంభించారు.వడ్డెర సంఘీయులకు అవసరమయ్యే కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు రేగళ్ల లక్ష్మీ అనిత,తెదేపా,జనసేన మండల పార్టీ అధ్యక్షులు మానుకొండ రామకృష్ణ,చింతలపాటి వెంకట కృష్ణారావు, పార్టీ నాయకులు యనమద్ది పుల్లయ్య చౌదరి, దేవభక్తుని సీతారామ్ ప్రసాద్,డి.వి కృష్ణారావు,రేగళ్ల వీరారెడ్డి,తిరువూరు,ఏ.కొండూరు మండల పార్టీ అధ్యక్షులు,పలు గ్రామాల పార్టీ అధ్యక్షులు,నాయకులు,శ్రేణులు,తదితరులు పాల్గొన్నారు.
