వర్షాలు కురవాలని ధర్మపురిలో మంత్రి పూజ‌లు

ధర్మపురి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సకాలంలో వర్షాలు కురవాలని, ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం వరుణ యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పుల కారణంగా ఈ ఏడాది వర్షాలు ఆలస్యమవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతుల పంటలు బాగా పండాలని సంకల్పంతో ధర్మపురి క్షేత్రంలో వరుణ యాగం నిర్వహించినట్లు తెలిపారు.

రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, పంటలు పుష్కలంగా పండాలని, రైతుల కష్టాలు తొలగిపోయి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.