NTR Memories | తిరుపతిలో ఎన్టీఆర్ ర్యాలీకి పోలీసుల సవాల్

NTR Memories | తిరుపతిలో ఎన్టీఆర్ ర్యాలీకి పోలీసుల సవాల్
NTR Memories | ఇందిరా గాంధీతో మరపురాని సంఘటన
ఎన్టీఆర్‌తో ఏర్పడిన ప్రత్యేక అనుబంధం
చిత్తూరు ఎస్‌పీగా ఎదురైన ఉద్విగ్న క్షణాలు
పోలీస్‌మాన్‌కు ఎన్టీఆర్ ఇచ్చిన జీవిత పాఠం
ఎన్టీఆర్ ఇచ్చిన ఫారిన్ పెన్ జ్ఞాపకం
రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్ వ్యక్తిత్వం
NTR Memories | జనవరి 3, 1983వ సంవత్సరం! అంతకు రెండు మూడు రోజుల ముందే తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం ప్రతినిధులుగా ఉన్న శివరామమూర్తి, నారాయణ నాయుడు, రామచంద్ర నాయుడు నన్ను కలిసి “సర్ మీరు ఎన్.టి.ఆర్ ర్యాలీకి, బహిరంగ సభకు పర్మిషన్ ఇవ్వాలి సార్! మేము ఏర్పాట్లు చేసుకోవాలి” అని అభ్యర్థించారు! “రేపు రండి ఎస్.పి గారిని కన్సల్ట్ చేసి చెబుతాను” అని చెప్పాను. అయిష్టంగానే వాళ్లు నన్ను వదిలి వెళ్లిపోయారు. అనుమతి లభిస్తుందో లేదో అన్న అనుమానపు ఛాయలు, వద్దనుకున్నా వారి వదనాల్లో కనిపించాయి!
నేను తిరుపతి అడిషనల్ ఎస్పీగా ఉన్నప్పుడే టి.డి.పిని స్థాపించడం జరిగింది! తిరుపతి ఎన్టీఆర్ కార్యక్రమాలకు వేదికగా మారటం పోలీసులకు వృత్తిపరంగా సవాలుగా మారింది! ఎన్నికల ప్రచారం చివరి రోజున అంటే జనవరి 3నాడు రెండు పార్టీలు, కాంగ్రెస్, తెలుగుదేశం ప్రచారానికి తిరుపతిలోనే తెరదించి క్లైమాక్స్‌కు సిద్ధమయ్యాయి! ప్రధానమంత్రికి తప్ప ఎవరికీ పోలీసులు అనుమతి అదేరోజున ఇవ్వ్వరని వారి అనుమానం! కానీ రెండు సభల మధ్య చాలా దూరం ఉండటం చేత మేము రెండు పార్టీల సభల నిర్వహణకు సిద్ధమయ్యామని వారికి చివరి క్షణం వరకు తెలియనివ్వలేదు!
ఇందిరా గాంధీ ఎన్నికల ప్రచారానికి చివరి రోజున రావటంతో పట్టణంలో ప్రజలకు ఉత్సాహభరితంగా ఎటు చూసినా సంరంభంగానే ఉంది. కానీ పోలీసులు ఇంత అట్టహాసంగా తలపెట్టిన రెండు సభలు, తదితర కార్యక్రమాలు ఎలా ముగుస్తాయో, శాంతిభద్రతల వైఫల్యం లేకుండా ఆ దినం ఎలా గడుస్తుందో అని బయటకు లాఠీలు ఊపుతూ తిరుగుతున్నా, ప్రతి పోలీసు అధికారులతో సహా మనసులో మథనపడుతూనే ఉన్నారు! హైదరాబాద్‌లో ఉన్న పోలీసు ఉన్నతాధికారులు, అధికార యంత్రాంగం పరిస్థితి అంతే ఉంది!
ఆ మధ్యాహ్నం ఇందిరా గాంధీ ర్యాలీ, బహిరంగ సభ విజయవంతంగా ముగిశాయి! సభావేదిక ఎక్కే ముందు ఒక్క క్షణం ఆగి వెనుకకు తిరిగి చూసి “థాంక్యూ ఆఫీసర్” అని నన్ను చూసి చెప్పటంతో నాకు ఉద్యోగ జీవితంలో మరుపురాని అనుభూతిగా మిగిలింది! దానికి కారణం అంతకు మునుపు రెండు గంటల ముందు, గెస్ట్ హౌస్ నుంచి బయటకు వచ్చి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ “వేదిక వద్ద జనం ఎలా ఉన్నారు?” అని అడిగారు అక్కడి నాయకులను! వారికి సమాచారం లేకపోవటంతో తెల్లమొహం వేశారు! వెనకగా, పైలట్ డ్యూటీలో ఉన్న నేను అప్రయత్నంగా “హార్డ్లీ ఏనీ క్రౌడ్ మేడమ్!” అన్నాను. అందరూ ఆమె సెక్యూరిటీ అడ్వైజర్‌తో సహా నన్ను ఆశ్చర్యంగా చూశారు!
“హౌ డు యు నో?” ప్రధానమంత్రి ప్రశ్నించారు!
“మానిటరింగ్ మేడమ్ త్రూ వైర్‌లెస్” అన్నాను నేను అనవసరంగా తలదూర్చానా అని మథనపడుతూ!
“హూ ఆర్ యు?”
“అడిషనల్ ఎస్.పి ఆఫ్ దిస్ ప్లేస్ మేడమ్” అన్నాను ధైర్యం కాపాడుకుంటూ!
“ఓకే! ఐ వాంట్ టూ గో త్రూ టౌన్ – కెన్ యూ టేక్ మీ?” పి.యం.
“యెస్ మేడమ్” అన్నాను ఉత్సాహంగా! నాకు ఎన్.టి.ఆర్ ర్యాలీ పట్టణంలో ఎటు వస్తుందో తెలుసు. అటుగా కాకుండా తీసుకొని పోతే సరిపోతుంది అనుకున్నాను! సెక్యూరిటీ అడ్వైజర్ రాంమూర్తి గారు నా దగ్గరకు వచ్చి “డోంట్ బి ఏ చైల్డ్! సరైన ప్రిపరేషన్ లేకుండా పి.యం.ను ఎలా తీసుకెళ్తావ్?” అడిగారు కోపంగా!
“ఆల్రెడీ కొంత ఫోర్స్‌ను ముందు జాగ్రత్త చర్యగా డిప్లాయ్ చేశాం సార్! ఏం ఫర్వాలేదు” అన్నాను ధైర్యంగా!
మా సంభాషణ వింటూ వచ్చిన పి.యం “ఆల్ రైట్! యంగ్ ఆఫీసర్! గెట్ బ్యాక్ ఇన్‌టూ ఓపెన్ టాప్ జీప్ అండ్ టేక్…” అన్నారు. జనం విరగబడి అనుకోకుండా తమ వీధిలోకి వచ్చిన పి.యం చూసి జేజేలు పలికి ఆమెకు సంతోషాన్ని కలిగించినట్లుంది! అందుకే ఆమె ర్యాలీ విజయవంతంగా ముగిసినందుకు సభావేదిక దగ్గర నాకు థాంక్స్ చెప్పారు!

ఎన్.టి.ఆర్ ప్రమాణ స్వీకారం సీఎంగా చేసిన రెండ్రోజుల్లోనే తిరుపతి పాదిరికుప్పం అనే ప్రదేశంలో జరిగిన దుర్ఘటన పూర్వాపరాలు తెలుసుకొనేందుకు తిరుపతి విమానాశ్రయంలో దిగారు. వెంబడి మా డీజీపీ కూడా ఉన్నారు. అందర్నీ పరిచయం చేస్తున్నప్పుడు డీజీపీ సీతారాంరావు “అడిషనల్ ఎస్.పీ” అన్నారు. ఒక అడుగు ముందుకు వేయబోయి సడెన్‌గా వెనక్కు తిరిగి షేక్ హ్యాండ్ ఇస్తూ “ఓ! ఓ! ఆర్ సీతారాంరావు! థాంక్యూ బ్రదర్” అన్నారు అభినందన పూర్వకంగా!
ప్రధానమంత్రి సభ ఉన్నప్పుడు పోలీసులు ఎన్టీఆర్ అయినా ఎవరైనా ఒకే పట్టణంలో మరో సభకు అనుమతి ఇవ్వ్వరని మొదట వారి కార్యకర్తలు చెప్పినట్లుంది! తర్వాత పోలీసు శాఖ ఆ ప్రాంత సీనియర్ అధికారిగా పర్మిషన్ ఇవ్వటం జరగటంతో దానికి నాకు థాంక్స్ చెప్పారని భావించాను. ఏదిఏమైనా ఎత్తుకు ఎదిగినవారి ఆలోచనల్లో సామీప్యత ఉంటుంది! ఆ ఎత్తుకు సామాన్యులు ఎదగటం కష్టం!
ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాలలో మే నెల 28నాడు జరుగుతున్న తరుణంలో రిటైర్డ్ పోలీసు ఆఫీసర్‌గా కాలం వెళ్లబుచ్చుతున్న నాకు అప్పటి సంఘటనలు ఆరోజు మరింతగా జ్ఞాపకం వస్తుంటాయి. ఎన్టీఆర్‌తో నేను అధికారిగా పదిలపర్చుకున్న అనుభవాలు అప్రయత్నంగా మదిలో మెదిలాయి!
చిత్తూరు ఎస్.పిగా ఉన్నాను. తెల్లవారుఝామున అయిదు గంటలకు ఫోన్ మ్రోగింది. ఫోన్ నేనే సాధ్యమైనంత వరకు తీస్తాను. అవతల నుంచి “సి.యం గారు మాట్లాడుతారట”! గుండె గతుక్కుమంది! ఎన్.టి.ఆర్ ఆవేళప్పుడా! నాకు తెలియకుండానే జిల్లాలో ఏదో పెద్ద ఉపద్రవం సంభవించిందా? అటునుంచి ఖంగున ఎన్.టి.ఆర్ కంఠం మ్రోగింది! “సార్” అన్నాను!
“ఏమిటీ మా ప్రజాప్రతినిధులు చిత్తూరు పోలీసుల మీద కంప్లయింట్ ఇచ్చారు! మీరు మావాళ్లు ఏదో సరదాకు పేకాట ఆడుకుంటుంటే తెచ్చి లోపల పడేశారట”!
నాకు సంగతి తెలుసు. సి.యం గారు చల్లబడేందుకు క్షణకాలం మాట్లాడలేదు!
“మాట్లాడరేం?” గట్టిగా అడిగారు!
“సార్ నేను చిత్తూరు జిల్లా చార్జి తీసుకొనే ముందు మిమ్మల్ని కలిస్తే అక్కడ అసాంఘిక కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయట! ఉక్కుపాదంతో అణిచేయండి! అని చెప్పారు. నిన్న రెండు క్లబ్బుల మీద రెయిడ్ చేయించాను సార్! చాలా డబ్బు దొరికింది! వాళ్లను అరెస్టు చేశాం నిర్వాహకులతో సహా! వారు టి.డి.పి కార్యకర్తలని పార్టీ పేరు అడ్డం పెట్టుకొని అలా చేస్తున్నారట సార్”.
ఒక్క క్షణం ఏం మాట్లాడలేదు. తర్వాత “భేష్! మంచిపని చేశారు. మీ వాళ్లకు రివార్డులు ఇవ్వండి! మా వాళ్లకు మర్చిపోలేని రీతిలో నేనూ రివార్డులు ఇస్తాను” అన్నారు. ఫోన్ క్లిక్ మన్న తర్వాత “హమ్మయ్య” అని అనుకున్నాను!
మండల ఎన్నికల ప్రచారంలో ఇంటెలిజెన్స్ తరఫున ఎస్.పి.గా ఉన్న నాకు సి.యం వెంట ఉండి బ్రీఫ్ చేసే డ్యూటీ ఇచ్చారు! కత్తిమీద సాములాగా ఉండేది నా పని! అతి ముఖ్యమైన విషయం నేను వంగి చెప్తున్నప్పుడు అది పట్టించుకోకుండా తదేకంగా నన్ను చూస్తూ “సిట్ స్ట్రైట్” అని గట్టిగా అన్నారు. నేను ఉలిక్కిపడి అటెన్షన్ ఫోజులో నడుం వంగకుండా కూర్చొని “సార్” అన్నాను.
తాపీగా చిరునవ్వుతో “పోలీస్‌మాన్ ఈజ్ ఆల్వేస్ ఎ పోలీస్‌మాన్! నిటారుగా ఉండాలి ఎప్పుడూ! అప్పుడే జనానికి ధైర్యం వస్తుంది” అని చెప్పారు. ఆ దెబ్బతో ఆయనతో ఎప్పుడూ నిటారుగా నిల్చున్నట్లు కూర్చొని మాట్లాడటమే నా పనిగా మారింది!
చైతన్య రథంలో ఒకసారి బ్రీఫ్ చేస్తున్నప్పుడు ఆయనకు పెన్ను అవసరం పడింది. నేను నా జేబులోంచి తీసి పెన్ను ఇచ్చాను! ఆ పెన్ను రాయలేదు! ప్రక్కన పడేస్తూ “ఏమిటీ పెన్ను?” అన్నారు.
“ఏం చేయను సార్ రోజుకో రూపాయి పెన్ను పెడ్తున్నాను. అయినా సరే పెన్నులు పోతూనే ఉన్నాయి” అన్నాను.
నవ్వుతూ ఆయన బ్రీఫ్ కేసులోంచి ఒక ఫారిన్ పెన్ను తీసి నాకు ఇస్తూ “ఇది ఉంచండి! బయట వాడకండి!” అన్నారు. నేను మొహమాటపడ్డాను.
“టేక్ ఇట్! దట్ ఈజ్ మై గిఫ్ట్” అన్నారు!
ఆ పెన్ను ఇప్పటికీ వాడకుండా దాచుకున్నాను! ఇలా చాలా జ్ఞాపకాలు ఉండటం నా అదృష్టం! అన్నిటిలో నాకు బాగా ప్రతిసారీ జ్ఞాపకం వచ్చే సంఘటన చెప్తాను!
రెండవసారి పెద్ద మెజార్టీతో ఆయన గెల్చి సీఎంగా అయినప్పుడు నేను అడిషనల్ డైరెక్టర్‌గా ఏ.సి.బిలో ఉన్నాను. సడెన్‌గా ఒక రోజు “మిమ్మల్ని సి.యం గారు రమ్మంటున్నారు” అన్న కబురు ఫోన్‌లో వచ్చింది!
నేను వెళ్లి ఆయనను కలిశాను!
“ఐ యామ్ ఏంగ్రీ విత్ యూ” అన్నారు!
“ఎందుకు సార్?” అని మెల్లగా అడిగాను.
“నన్ను చూడటానికి రాలేదేం? మనం ఎక్స్‌ట్రా వెల్ ఫ్రెండ్స్ కదా!” అన్నారు.
“సార్ నేను మా డైరెక్టర్, ఇతర ఆఫీసర్లతో వచ్చి కలిశాం సార్! అయినా సి.యం గారికి ఒక పోలీసు ఆఫీసర్‌గా నేను ఎలా ఫ్రెండ్ అవుతాను సార్” అన్నాను!
ఆయన నవ్వి “యూ ఆర్ ఇన్ ఫర్ ఏ గుడ్ పోస్టింగ్” అన్నారు. “డి.ఐ.జీ అయ్యారుగా! ఏది మంచి పోస్టో మీరే చెప్పండి” అన్నారు.
నేను మాట్లాడలేదు! ప్రక్కనే ఉన్న ఐజీ ఇంటెలిజెన్స్ “హైదరాబాద్ రేంజ్ డి.ఐ.జి సార్! అది బెస్ట్ పోస్టింగ్” అని చెప్పారు.
“ఓకే! ఆర్డర్స్ వస్తాయి! సిద్ధంగా ఉండండి”
ఎవ్వరూ ఊహించని విధంగా నాకు ఆ పోస్టింగ్ వచ్చింది! పోస్టింగ్ కంటే ముఖ్యం ఆయన నన్ను చూసిన విధానం! అభిమానించిన తీరు! అంత గొప్ప వ్యక్తి నన్ను దగ్గరకు తీసుకోవటం! అందుకే ఎప్పుడూ మదిలో మెదిలే ఎన్.టి.ఆర్. ప్రతి సంవత్సరం మే 28నాడు నా హృదయంలో మరింతగా ప్రతిష్టించబడుతూనే ఉంటారు.
రావులపాటి సీతారాంరావు
