దళితులపై దాడులు అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలం: గంగాదేవి సైదులు

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : దేశంలో దళితులపై జరుగుతున్న కుల వివక్ష, సామాజిక అణచివేత, దాడులను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గంగాదేవి సైదులు విమర్శించారు. మంగళవారం చౌటుప్పల్‌లో జరిగిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో దళితులు భూహక్కులు, ఉపాధి, గృహాలు, తాగునీరు వంటి మౌలిక వసతుల విషయంలో నేటికీ వివక్షను ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి బాధితులకు న్యాయం చేయాలని, దళితుల ఆర్థికాభివృద్ధికి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు యాట బాలరాజు, చింతల సుదర్శన్, బోయ యాదయ్య, మానే సాలయ్య, యాట ముత్యాలు, పొట్ట వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.