- అధికార బలంతో వ్యవహరిస్తే… వ్యతిరేకత తప్పదు
- కాంగ్రెస్ పాలనలో రైతులకు ఎలాంటి మేలు జరగలేదు.
- తెలంగాణ పరిస్థితి దిగజారుతోంది.
- డైవకర్షన్ పాలిటిక్స్ కు బీఆర్ఎస్ నేతలు రెచ్చిపోవద్దు.
పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సిద్ధిపేట జిల్లాలోని ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సన్నాహక సమావేశాలు కొనసాగుతున్నాయి.
బీఆర్ఎస్ బాస్, మాజీ సీఎం కేసీఆర్ ఈరోజు (శనివారం) సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మూడు ఉమ్మడి జిల్లాలైన నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ నేతలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఈనెల 27న జరిగే సిల్వర్ జూబ్లీ సభ ఏర్పాట్లపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ‘‘ఒకప్పుడు తెలంగాణను విఫల ప్రయోగం అని పిలిచిన శక్తులే.. ఇప్పుడు అధికారంలో ఉన్నాయని కేసీఆర్ అన్నారు. తమ సొంత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బీఆర్‌ఎస్‌పై నిందలు వేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వం తమ ఇష్టానుసారం వ్యవహరిస్తే, కోర్టులు, పౌర సమాజం, విద్యార్థుల నుండి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుందని కేసీఆర్ అన్నారు. దానికి ప్రస్తుత HCU వివాదం ఒక ఉదాహరణ అని కేసీఆర్ పేర్కొన్నారు.
సర్పంచ్ హోదాలో ఉన్న వ్యక్తి కూడా ప్రజలకు మంచి చేయాలని ప్రయత్నిస్తారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మెప్పించే ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత, నిజాయితీ, పరిపాలనా సంకల్పం లేకపోవడం వల్ల తెలంగాణలో పరిస్థితి దిగజారుతోందన్నారు.
కాంగ్రెస్ ప్రాథమిక అవసరాలైన సాగునీరు, తాగునీరు, విద్యుత్తును అందించడంలో విఫలమైందని, రైతులకు ఎలాంటి మేలు జరగడం లేదన్నారు. కాంగ్రెస్ పాలనలో పంచాయతీ, మునిసిపల్ పాలన కుప్పకూలిందని అన్నారు. కాంగ్రెస్ డైవకర్షన్ పాలిటిక్స్ కు బీఆర్ఎస్ నేతలు రెచ్చిపోకూడదని, వారి కుతంత్రాలను ప్రజలు అర్థం చేసుకుంటారని కేసీఆర్ అన్నారు.
నియోజకవర్గాల వారీగా కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని, వరంగల్ సభకు ప్రజలను సమీకరించడంపై దృష్టి పెట్టాలని నాయకులకు కేసీఆర్ చెప్పారు. మళ్ళీ ఎన్నికల్లో అధికారం మనదేనని కేసీఆర్ అన్నారు.
కాగా, ఇప్పటికే ఉమ్మడి వరంగల్, నల్గొండ, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా నేతలతో కేసీఆర్ సమావేశాలు నిర్వహించారు. ఈ నెల 23వ తేదీ వరకు పార్టీ నేతలతో గులాబీ బాస్ సమావేశాలు నిర్వహించనున్నారు.