పి.ఆర్.టి.యు ధర్నా విజయవంతం చేయాలని పిలుపు…

పి.ఆర్.టి.యు ధర్నా విజయవంతం చేయాలని పిలుపు…
చిట్టినగర్, ఆంధ్రప్రభ : విజయవాడ పశ్చిమ నియోజక చిట్టినగర్ లోని ప్రైవేట్ పాఠశాలలో ఆదివారం ఉదయం విజయవాడ రూరల్ మండలం పిఆర్టీయు అధ్యక్షులు మార్కండేయ శర్మ అధ్యక్షతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య నాయకులు రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ళ రమేష్ బాబు, ఎన్టీర్ జిల్లా పి.ఆర్.టి.యు కార్యనిర్వహక అధ్యక్షులు కోసూరి రాజశేఖర్ ధర్నా కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా కోసూరి రాజశేఖర్ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల డిమాండ్ల సాధనకు తలపెట్టిన దశల వారీ ఉద్యమంలో భాగంగా ఈ నెల 21 న కలెక్టరేట్ వద్ద చేపట్టే ధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున సభ్యులు తరలిరావాలన్నారు.
ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు కావస్తున్నా పాలకులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని అన్నారు. పెండింగ్ లో ఉన్న నాలుగు డీ ఏ లు విడుదల చేయాలని, పీఆర్సీని ఏర్పాటు చేసి 30 శాతం ఐ ఆర్ ప్రకటించాలని అన్నారు. ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేసి పదోన్నతులు కల్పిం చాలని తెలిపారు., సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం తీసుకురావాలని డిమాండ్ చేశారు. 2003 డీఎస్సీ వారికి మెమో 57 ను వర్తింప చేయాలని డిమాండ్ చేశారు.
కారుణ్య నియామకాలను ఆయా జిల్లాల కలెక్టర్ల పరిధిలో చేపట్టాలన్నారు. మున్సిపల్, కార్పొరేషన్ పరిధిలోని ఉపాధ్యాయులకు జీపీఎఫ్ అకౌంట్లు ఏర్పాటు చేయాలని అన్నారు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం లను గ్రేడ్ 1 హెచ్ఎం లుగా పరిగణించాలని కోరారు. కేజీబీవీ, మోడల్ స్కూళ్లు, గురుకులాలను ప్రభుత్వంలో విలీనం చేయాలన్నారు. కేజీబీవీ వారికి ఎంటీఎస్ వర్తింప చేయాలని కోరారు, విద్యాశాఖలో పనిచేస్తున్న సీఆర్టీలకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఇన్ సర్వీస్ వ్యాయామ ఉపాధ్యాయులకు బీపీఈడీ, ఎంపీఈడీ చేసేందుకు అవకాశం కల్పించాలన్నారు.
ప్రతి ఉన్నత పాఠశాలకు మోడల్ ప్రైమరీ స్కూల్ డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల ప్రధాన కార్యదర్శి సుభాష్ చంద్రబోస్ తోపాటు ముఖ్య నాయకులు షేక్ యూసఫ్, నగేష్ చంద్, కుందా విజయరామ్ ప్రసాద్, సునీత, రమాదేవి, జ్యోతి, మౌలాస, పజ్జురి శ్రీనివాస్, సునంద్ తదితరులు పాల్గొన్నారు.
