పేరూరు స్పూర్తి…రాష్ట్రానికి మార్గదర్శి…

పేరూరు స్పూర్తి…రాష్ట్రానికి మార్గదర్శి…

75 ఏళ్ల ప్రభుత్వ పాఠశాల వజ్రోత్సవ వేడుకల్లో మంత్రి వాకిటి శ్రీహరి సందేశం
గ్రామానికి మినీ స్టేడియం హామీ
పాఠశాల అభివృద్ధిలో భాగంగా ఇంటర్ అప్‌గ్రేడ్‌కు మాట

కౌకుంట్ల, ఆంధ్రప్రభ : ఏడు దశాబ్దాల విద్యా వైభవాన్ని సాక్షిగా చేసుకుని పేరూరు జడ్‌పీహెచ్‌ఎస్ పాఠశాల వజ్రోత్సవ వేడుకలు ఆదివారం ఉత్సాహభరితంగా జరిగాయి.ఈ వేడుకతో గ్రామమంతా పండుగ వాతావరణంలో మునిగిపోయింది.వేలాదిమంది పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు ఒకే వేదికపై కలిసిన ఈ అరుదైన సందర్భం గ్రామ ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. ఈ కార్యక్రమంలో భాగంగా పూర్వ విద్యార్థులు ఉదయం 6 గంటలకు ప్రభాతబేరీతో నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉపాధ్యాయులతో పాటు గ్రామమంతా తిరిగారు.

అంతరం పాఠశాల చేరుకొని 9:30 గంటలకు పాఠశాల ఆవరణలో వరుస లైన్ లో నిలబడి వందేమాతరం, జనగణమన, జయ జయహే తెలంగాణ గీతాలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత నాడు చదువు నేర్పిన గురువులకు రెడ్ కార్పెట్ పరిచి పూర్ణకుంభంతో, పూలు వెదజల్లుతూ కోలాటాలతో సంపురంగా ఘన స్వాగతం పలికారు.

ఈ వేడుకకు గ్రామస్తులు,పూర్వ విద్యార్థులు,గ్రామ సర్పంచ్ శృతి అరవింద్ కుమార్ రెడ్డి ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, క్రీడలు, యువజన మత్స్య శాఖల మంత్రి వాకిటి శ్రీహరి, దేవరకద్ర శాసన సభ్యులు జి.మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ…75 ఏళ్ల క్రితమే విద్య అవసరాన్ని గ్రహించి పాఠశాల స్థాపించిన నేత కీర్తిశేషులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కేకే రెడ్డికి దూరదృష్టి లేకపోయి ఉంటే ఈరోజు పేరూరు ఇంత ముందుండేది కాదని, గ్రామ అభివృద్ధి చరిత్రను ఒక్కొక్కటిగా గుర్తు చేస్తూ మంత్రి మాట్లాడారు.

నాడు రాష్ట్రంలో అనేక గ్రామాల్లో కరెంట్ రాకముందు…రోడ్లు లేకముందు… ఆసుపత్రులు లేకముందే ఈ ఊరు విద్య కోసం పోరాడింది. అదే ఈరోజు పేరూరుని ప్రత్యేకంగా నిలబెట్టింది అని వ్యాఖ్యానించారు.ఆ దిశగా కృషి చేసిన కేకే రెడ్డి సేవలను గుర్తుచేస్తూ సభలో చప్పట్లు కొట్టించారు. అంతేకాక అదే కుటుంబం నుంచి నేడు సర్పంచ్ గా శృతి అరవింద్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నికపై మంత్రి ప్రత్యేకంగా స్పందించారు. ఈరోజుల్లో రాజకీయాలు విభేదాలకు వేదిక అవుతున్నా…

ఇంత పెద్ద గ్రామంలో ఏకగ్రీవంగా సర్పంచ్‌ను ఎన్నుకోవడం చిన్న విషయం కాదు… ఇది పేరూరు సంస్కృతి, ఐక్యతకు నిదర్శనం అని అన్నారు. ఇక అభివృద్ధి హామీలను మంత్రి స్పష్టంగా ప్రకటించారు. స్థానిక ఎమ్మెల్యే జిఎంఆర్, కాంగ్రెస్ నాయకులు అరవింద్ కుమార్ రెడ్డి కోరిక మేరకు ఈ వేదిక మీదే చెబుతున్నా… పేరూరుకు మినీ స్టేడియం ఖాయం. యువతకు క్రీడా వసతులు కల్పిస్తాం.ఈ పాఠశాలను ఇంటర్మీడియట్ స్థాయికి అప్‌గ్రేడ్ చేయడం నా బాధ్యత అని ధీమాగా చెప్పారు.అంతేకాక మంత్రి భావోద్వేగంతో ఇంత పెద్ద కార్యక్రమానికి ఈరోజు నేను రాకపోయి ఉంటే…

నా జీవితంలో ఒక గొప్ప క్షణాన్ని మిస్ అయ్యేవాడిని. పేరూరు చూపించిన ఈ ఐక్యత, ఈ విద్యాస్పూర్తి… రాష్ట్రానికి ఆదర్శం అని చెప్పారు.అనంతరం ఈప్రాంత అభివృద్ధిలో ఎమ్మెల్యే జిఎంఆర్ పాత్రను కొనియాడుతూ… ఎవరు ఏది అడిగితే వారి కోసం కాదు… అడగకపోయినా అభివృద్ధి కోసం కష్టపడే నాయకుడు జిఎంఆర్ అని ప్రశంసించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ప్రస్తావిస్తూ విద్య, సంక్షేమం, అభివృద్ధి, మూడు రంగాల్లో తెలంగాణను ముందంజలో నిలబెట్టే దిశగా ప్రభుత్వం దూసుకెళ్తోంది అని పేర్కొన్నారు.

టీచర్లకు పెద్దఎత్తున బదిలీలు, ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా విద్యా వ్యవస్థలో మార్పు తీసుకొచ్చామని తెలిపారు. పేద విద్యార్థులకు నాణ్యమైన బియ్యం, మెరుగైన వసతులు అందించడం ప్రభుత్వం కట్టుబాటని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నిర్వాహకులకు, గ్రామ ప్రజలకు మంత్రి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

విద్యే పేరూరి బలం…డైమండ్ జూబ్లీ వేడుకల్లో ఎమ్మెల్యే జిఎంఆర్

పేరూరు జడ్‌పీహెచ్‌ఎస్ పాఠశాల 75 ఏళ్ల డైమండ్ జూబ్లీ వేడుకల్లో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ…1950లోనే విద్య ప్రాధాన్యతను గుర్తించి పాఠశాల స్థాపించిన గ్రామ పెద్దలు, ముఖ్యంగా కే.కే రెడ్డి సేవలు చిరస్మరణీయం అన్నారు. పాఠశాలలో మ్యాథమెటిక్స్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అలాగే మినీ స్టేడియం కోసం మంత్రి వాకిటి శ్రీహరిని కోరగా, మంత్రి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వం విద్యాభివృద్ధికి కట్టుబడి ఉందని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

అనంతరం వివిధ గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు 60 సైకిళ్లను పంపిణీ చేశారు.రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (TGCPCR) చైర్‌పర్సన్‌ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ… పేరూరు పాఠశాలకు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చేశానని, నేడు 75 వసంతాలు జరుపుకోవడం సంతోషంగా ఉందని ప్రాణన రోజుల్లో శతజయంతి ఉత్సవాలు కూడా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు.

Leave a Reply