ఆపరేషన్ “వజ్రప్రహార్”లో మెగా తనిఖీలు

ఆపరేషన్ “వజ్రప్రహార్”లో మెగా తనిఖీలు

20 వాహనాల స్వాధీనం, రౌడీషీటర్లకు కౌన్సిలింగ్

కర్నూలు, ఆంధ్రప్రభ : జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణ లక్ష్యంగా పోలీసు శాఖ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం “ఆపరేషన్ వజ్రప్రహార్”లో భాగంగా రచ్చుమర్రి గ్రామంలో మెగా కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, మాధవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎమ్మిగనూరు డిఎస్పీ శ్రీమతి ఎం.ఎన్. భార్గవి ఆధ్వర్యంలో ఈ సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలోని అనుమానాస్పద ప్రాంతాలు, ఖాళీ స్థలాలు, నివాస ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అక్రమ మద్యం, గుట్కా నిల్వలపై ప్రత్యేక దృష్టి సారించి పరిశీలించారు.

అలాగే రౌడీషీటర్లను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా పత్రాలు లేని 12 మోటార్ సైకిళ్లు, నంబర్ ప్లేట్లు లేని 8 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సాగు, నాటుసారా తయారీ వంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

గ్రామాల్లో అనుమానాస్పద చలనం గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఆపరేషన్‌లో సిఐలు దస్తగిరి, మంజునాథ్, ఎస్సైలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో డ్రగ్స్ రహిత వాతావరణం కోసం ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.