మిన్నంటిన ‘వీరుని’ ఉత్సవ సంబరాలు
మిన్నంటిన ‘వీరుని’ ఉత్సవ సంబరాలు
నల్లబెల్లి, ఆంధ్రప్రభ: తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని భక్తి, ఉత్సాహాలతో నిలబెట్టుకుంటూ రాంపూర్ గ్రామంలో “వీరుని” ఆచారం ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన పాయినేని రాజేశ్వరరావు కుటుంబ సభ్యులు నిర్వహించిన ఈ కార్యక్రమం గ్రామస్థులందరినీ ఆకట్టుకుని ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది. వీరభద్ర స్వామికి అంకితంగా నిర్వహించిన ఈ వేడుకల్లో కుటుంబ సభ్యులు సంప్రదాయ దుస్తులు ధరించి, ఖడ్గాలు, త్రిశూలాలతో వీరత్వాన్ని ప్రతిబింబించే విధంగా ఆచారాలు నిర్వహించారు. డప్పుల మోగింపులతో గ్రామం మారుమోగగా, యువత ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమానికి ఉత్సవ శోభను తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా పాయినేని రాజేశ్వరరావు మాట్లాడుతూ, తమ కుటుంబంలో “వీరుని” ఆచారం తరతరాలుగా కొనసాగుతోందని, గ్రామ శాంతి, రక్షణ కోసం ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నామని తెలిపారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ పాల్గొనడంతో గ్రామంలో ఐక్యత, ఆనందం వెల్లివిరిసింది. గ్రామ ప్రజలు భారీగా హాజరై కార్యక్రమాన్ని తిలకించగా, పాయినేని కుటుంబ సభ్యుల ఈ సంప్రదాయ పరిరక్షణకు ప్రశంసలు కురిపించారు. నల్లబెల్లి మండలంలో ఈ వీరుని ఆచారం ప్రతి ఏడాది మరింత వైభవంగా నిర్వహించబడుతూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటోంది.
