భూపాలపల్లిలో లక్ష్యాలకు మించి బొగ్గు ఉత్పత్తి

భూపాలపల్లిలో లక్ష్యాలకు మించి బొగ్గు ఉత్పత్తి

  • మే నెలలో మరింత పెంపుకు కార్యాచరణ
  • ప్రకటన విడుదల చేసిన ఏరియా జీఎం

భూపాలపల్లి రూరల్ , ఆంధ్రప్రభ: సంస్థ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచాల్సిన అవసరం ఉందని భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఏప్రిల్ నెల ఉత్పత్తి, రవాణా వివరాలను వెల్లడిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 2026లో బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 2.35 లక్షల టన్నులు కాగా, వాస్తవంగా 3.05 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి 130 శాతం సాధించినట్లు తెలిపారు. రోజువారీ సగటు ఉత్పత్తి 10,165 టన్నులుగా నమోదైనట్లు వెల్లడించారు. ఓపెన్‌కాస్ట్ గనుల పనితీరు విషయానికొస్తే, KTK-OC2 గనిలో 15.00 లక్షల క్యూబిక్ మీటర్ల లక్ష్యానికి 12.50 లక్షల క్యూబిక్ మీటర్లు (83%) సాధించగా, KTK-OC3 గనిలో 16.50 లక్షల క్యూబిక్ మీటర్ల లక్ష్యానికి 22.08 లక్షల క్యూబిక్ మీటర్లు (133%) సాధించినట్లు పేర్కొన్నారు.

మొత్తంగా 31.50 లక్షల క్యూబిక్ మీటర్ల లక్ష్యానికి 34.58 లక్షల క్యూబిక్ మీటర్లు సాధించి 110 శాతం నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే, మే 2026 నెలకు ఏరియా ఉత్పత్తి, రవాణా లక్ష్యాన్ని 2.38 లక్షల టన్నులుగా నిర్ణయించినట్లు తెలిపారు. వార్షిక ఆపరేషన్ ప్లాన్ (AOP) ప్రకారం KTK-OC2, KTK-OC3 గనుల్లో ఓబీ రిమూవల్ లక్ష్యం 32.50 ఎల్‌బీసీఎం‌గా నిర్దేశించినట్లు వివరించారు. అధికారులు, ఉద్యోగులు, కార్మికులు సమిష్టిగా కృషి చేసి ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు సమన్వయంతో కూడిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా SDL యంత్రాల పనిగంటలను పెంచేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

గైర్హాజరు శాతాన్ని తగ్గించడం ద్వారా ఉత్పత్తి స్థాయిని మరింతగా పెంచవచ్చని పేర్కొంటూ, ఈ దిశగా కార్మికులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. భద్రతా నిబంధనల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని హెచ్చరించారు. ప్రతి ఉద్యోగి వర్కింగ్ పర్మిట్‌తో పాటు అన్ని భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. “రక్షణ విషయంలో రాజీ లేదు” అనే ధోరణితో ముందుకు సాగాలని తెలిపారు. సమిష్టి కృషి, క్రమశిక్షణ, భద్రతతో కూడిన ఉత్పత్తి ద్వారానే స్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అధికారులు, ఉద్యోగులు, కార్మికులు ఒక్కటిగా పనిచేస్తే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని నమ్మకం వ్యక్తం చేశారు.