అంగరంగ వైభవంగా సత్తమ్మ మరిడిమాంబ అమ్మవారి పండుగ

అంగరంగ వైభవంగా సత్తమ్మ మరిడిమాంబ అమ్మవారి పండుగ
దుష్టశక్తులను తరిమికొట్టి.. అమ్మవారిని కొలువుతీర్చారు..!
కోలాహలంగా సాగిన జాతర
తరలి వచ్చిన గ్రామాల ప్రజలు
మొక్కులు చెల్లించుకున్న భక్తులు
దాతలకు ఉచితంగా చీరలు పంపిణీ
భక్తులకు మజ్జిగ డ్రింక్స్ మంచినీరు ప్రసాదాలు సరఫరా
సింహాచలం – ఆంధ్రప్రభ : సింహాద్రి నాథుడి సోదరిగా, గ్రామ పొలిమేరల్లో కొలువై ప్రజలను కాపాడే పొలిమేర దేవతగా ప్రసిద్ధి చెందిన శ్రీ సత్తమ్మ మరిడిమాంబ అమ్మవారి పండుగ మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అడివివరం, శ్రీనివాస్‌నగర్ పరిసర 14 గ్రామాల ప్రజల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్న అమ్మవారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు.

భక్తులు పసుపు, కుంకుమ, చీర, రవిక వస్త్రాలు, పండ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి మొక్కుబడిగా వచ్చిన చీరలను దాతలకు ఉచితంగా పంపిణీ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, అధ్యక్షుడు పి. వెంకట్రావు, కమిటీ సభ్యులు భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామున సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొలిపి వేలాది మంది భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.

మిట్టమధ్యాహ్నం మండుటెండలో సంప్రదాయబద్ధంగా అమ్మవారి అనుపు మహోత్సవం ప్రారంభమైంది. వేపచెట్టు కర్రతో రూపొందించిన అమ్మవారి విగ్రహాన్ని పసుపు, కుంకుమలతో అలంకరించి గాంధీనగర్‌లోని శదకం పట్టు వద్ద లండ వంశీయులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన పూజారి అమ్మవారి విగ్రహాన్ని శిరస్సుపై ధరించగా, భక్తులు కర్రలతో రక్షణగా నిలిచి దుష్టశక్తులను తరిమికొట్టే సంప్రదాయాన్ని ఆచరించారు.

సంప్రదాయ డప్పు వాయిద్యాల నడుమ ప్రారంభమైన ఊరేగింపు తోటవీధి, రామాలయం, రాజవీధి, సింహాచలం ప్రధాన కూడలి, బీఆర్‌టీఎస్ రహదారి, పైడితల్లమ్మ ఆలయం మీదుగా పాత గోశాలకు చేరుకుంది. భక్తులు ఘటాలతో పాటు అమ్మవారి వెంట పాదయాత్రగా పాల్గొన్నారు. దారిపొడవునా మహిళలు, భక్తులు ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తూ అమ్మవారికి స్వాగతం పలికారు.

గ్రామ సంప్రదాయాల ప్రకారం పాత గోశాల వద్ద ఏర్పాటు చేసిన తోరణం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణలు చేసిన అనంతరం బాలాజీనగర్ మీదుగా పొలిమేరలోని ఆలయానికి చేరుకుని అమ్మవారిని మూలవిరాట్ సన్నిధిలో కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు తమతో తీసుకువచ్చిన పిండి వంటలు, ఇతర నైవేద్యాలను సమర్పించారు.
దాదాపు రెండు కిలోమీటర్ల మేర సాగిన ఈ ఊరేగింపులో పాల్గొన్న భక్తులకు స్వచ్ఛంద సేవకులు మజ్జిగ, శీతల పానీయాలు, మంచినీరు, ప్రసాదాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పూజారుల వంశీయులు లండ వెంకటరమణ తదితరులు, కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు కర్రి అప్పలస్వామి, మాజీ కార్పొరేటర్ పీవీ నరసింహం, జనసేన నాయకుడు మజ్జి సూరిబాబు, టీడీపీ నాయకులు, గ్రామ పెద్దలు, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.
