తెలంగాణ ఉద్యమ నాయకుడి అడుగు ఎటు వైపు?

చిట్యాల, ఆంధ్రప్రభ : విద్యార్థి నేతగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన సీనియర్ రాజకీయ నాయకుడు, చిట్యాల మున్సిపాలిటీకి చెందిన తెలంగాణ ఉద్యమ నేత కూనూరు సంజయ్ దాస్ గౌడ్ ఉగాది తర్వాత తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఆయన, ప్రస్తుతం ఏ రాజకీయ దిశగా అడుగులు వేస్తారన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఉగాది అనంతరం శుభ ముహూర్తంలో తన అనుచరులు, మిత్రులతో సమావేశమై తదుపరి రాజకీయ అడుగులపై నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయన సొంతగూటిగా భావించే బీఆర్‌ఎస్ పార్టీలోకి వెళ్తారా, లేక తెలంగాణ జాగృతి సంస్థలో కీలక పాత్ర పోషిస్తారా, లేదా అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతారా అన్న అంశంపై ఆసక్తి నెలకొంది.

తెలంగాణ ఉద్యమ కాలం నుంచి బీఆర్‌ఎస్ పార్టీతో పాటు తెలంగాణ జాగృతి సంస్థలో కొనసాగిన సంజయ్ దాస్ గౌడ్‌కు మాజీ మంత్రులు కేటీఆర్, గుంతకండ్ల జగదీష్ రెడ్డిలతో పాటు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వద్ద మంచి గుర్తింపు ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు. గతంలో ఆ నేతలకు అత్యంత సన్నిహితుడిగా, ముఖ్య అనుచరుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉండేదని చెబుతున్నారు. ఇప్పటికే ఆయన చేరికపై కొంతమంది నేతలతో సంప్రదింపులు జరిగినట్లు సమాచారం.

అలాగే ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సంజయ్ దాస్ గౌడ్ ఆయనకు తోడునీడగా పనిచేశారని, ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశముందా అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

ప్రజా సమస్యలపై ఎన్నో పోరాటాలు చేసి, సేవా కార్యక్రమాలు నిర్వహించిన సంజయ్ దాస్ గౌడ్‌కు ప్రజల్లో మంచి పట్టు, గుర్తింపు ఉంది. ఆయన తీసుకునే నిర్ణయం స్థానిక రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా సంజయ్ దాస్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రజల ఆశయాలు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని తాను నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు.