ఎస్‌ఐఆర్ సర్వేను సద్వినియోగం చేసుకోవాలి..

  • మాజీ ఎంపీపీ భూక్య అమ్మి బాపూరావు

కడెం, ఆంధ్రప్రభ : కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) సర్వేను ఓటర్లు సద్వినియోగం చేసుకుని తమ వివరాలను సరిచేసుకోవాలని కడెం మండల మాజీ ఎంపీపీ భూక్య అమ్మి బాపూరావు కోరారు.

కడెం మండలంలోని పాత మద్దిపడగ గ్రామంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ఓటరు జాబితా ప్రత్యేక పరిశీలన, మ్యాపింగ్ కార్యక్రమాన్ని శనివారం ఆయన పరిశీలించారు. బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి భూక్య జాన్సన్ నాయక్, మండల అధ్యక్షుడు నల్ల జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీఎల్‌వో రాజమణితో కలిసి గ్రామంలో ఇంటింటికీ తిరిగి ఓటరు జాబితా పరిశీలన చేపట్టారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పంజాల శకుంతల రామగౌడ్, ఉపసర్పంచ్ డి. రమణయ్య, బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు గద్దల దేవయ్య, పార్టీ బీఎల్‌ఏలు, ఆల్‌పార్టీ నాయకులతో కలిసి ఓటరు జాబితా ప్రత్యేక సవరణ, మ్యాపింగ్ ప్రక్రియను పరిశీలించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఓటరు వివరాలు సక్రమంగా నమోదు కావడంతో పాటు ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజలు ఈ ప్రత్యేక సర్వేకు పూర్తిస్థాయిలో సహకరించి, తమ ఓటరు వివరాలను పరిశీలించి అవసరమైన మార్పులు, చేర్పులు, సవరణలు చేసుకోవాలని కోరారు.

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో సక్రమంగా నమోదు కావడం ప్రతి పౌరుడి బాధ్యత అని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు రాకేం సదానందం, పల్లె నారాయణ, బూత్ కమిటీ సభ్యులు జైల నర్సయ్య, బుగ్గరాపు భీంరాజ్, రాకేం రాజేశ్వర్, గ్రామస్తులు పడాల చిన్నయ్య, నవీన్, పల్లె వెంకన్న తదితరులు పాల్గొన్నారు.