Rs 400 Cr Project : ఇక కర్నూలు సోనా ధగధగ Andhra Prabha Top Story

Rs 400 Cr Project : ఇక కర్నూలు సోనా ధగధగ Andhra Prabha Top Story
- త్వరలో జేపీఎఫ్.. సైరన్
- జూన్ నుంచి ఉత్పత్తి షురూ
- జొన్నగిరి ఇక స్వర్ణమయం
- భారత తొలి భారీ ప్రైవేట్ గోల్డ్ .
- కర్నూలుకు కొత్త గుర్తింపు.
- మారనున్న ఆర్థిక దశ దిశ
- .రాయలసీమలో బంగారు భవితకుశ్రీకారం.
- .ఉపాధి, పెట్టుబడులకు ఇదొక కొత్త కేంద్రం.
- ..జూన్‌లో అధికారిక సైరన్
( కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ ):

రాయలసీమలో పారిశ్రామిక అభివృద్ధికి కొత్త అధ్యాయాన్ని తెరలేపే జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు జూన్ నెలలో పూర్తి స్థాయి కార్యకలాపాలకు సిద్ధమవుతోంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి ప్రాంతంలో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టు దేశంలోనే తొలి భారీ ప్రైవేట్ బంగారు గని ప్రాజెక్టుగా గుర్తింపు పొందుతోంది. దాదాపు 70 ఏళ్ల తర్వాత భారతదేశంలో సమగ్ర ప్రాసెసింగ్ సదుపాయాలతో ప్రైవేట్ రంగంలో ఏర్పడుతున్న తొలి బంగారు గని కావడం విశేషం.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూన్ రెండో లేదా మూడో వారంలో ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తికాగా, పూర్తి స్థాయి ఉత్పత్తికి అవసరమైన యంత్రాలు, మౌలిక వసతులు, ప్రాసెసింగ్ వ్యవస్థల ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి.
Rs 400 Cr Project : రూ.400 కోట్లకు పైగా పెట్టుబడులు

జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టులో ఇప్పటివరకు రూ.400 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినట్లు సంస్థ వర్గాలు వెల్లడించాయి. జియోమైసోర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాజెక్టుకు త్రివేణి ఎర్త్‌మూవర్స్, డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్, ఆస్ట్రేలియా రిసోర్సెస్ ఇండియా లిమిటెడ్ తదితర సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. భూసేకరణ, ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణం, విద్యుత్ సదుపాయాలు, నీటి పైప్‌లైన్లు, టైలింగ్ డ్యామ్, యంత్రాల కొనుగోలు, రహదారుల అభివృద్ధి వంటి పనులకు భారీగా నిధులు ఖర్చు చేశారు. 2023లోనే అదనంగా రూ.60 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు సమీకరించి ప్రాజెక్టు వేగవంతం చేశారు.
Rs 400 Cr Project : 598 హెక్టార్లలో భారీ ప్రాజెక్టు

జొన్నగిరి, యర్రగుడి, పగిడిరాయి గ్రామాల పరిధిలో సుమారు 597.82 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ గని ప్రాజెక్టు విస్తరించింది. 2063 వరకు చెల్లుబాటు అయ్యే మైనింగ్ లీజ్‌ను సంస్థ పొందింది. పర్యావరణ అనుమతులు, స్థాపన అనుమతులు, కార్యకలాపాల అనుమతులు కూడా ఇప్పటికే లభించాయి. ప్రస్తుతం ఓపెన్ పిట్ మైనింగ్ విధానంలో తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఖనిజ శుద్ధి ప్రక్రియలు నిర్వహించనున్నారు. క్రషింగ్, కార్బన్-ఇన్-లీచ్ ప్రాసెస్, స్మెల్టింగ్ వంటి సాంకేతిక పద్ధతుల ద్వారా బంగారం వెలికితీయనున్నారు.
Rs 400 Cr Project : రోజుకు 2,500 టన్నుల ప్రాసెసింగ్

ప్రస్తుతం రోజుకు వెయ్యి టన్నుల ఖనిజాన్ని ప్రాసెస్ చేసే సామర్థ్యంతో ప్లాంట్ పనిచేస్తోంది. పూర్తి స్థాయి యంత్రాల అమరిక అనంతరం రోజుకు 2,500 టన్నుల వరకు ఖనిజాన్ని శుద్ధి చేసే స్థాయికి విస్తరించనున్నారు.2026-27 నాటికి సంవత్సరానికి 750 నుంచి 1,000 కిలోల బంగారం ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గుర్తించిన బంగారు నిల్వలను ఆధారంగా తీసుకుని వచ్చే 15 సంవత్సరాలపాటు ఉత్పత్తి కొనసాగుతుందని సంస్థ వర్గాలు పేర్కొంటున్నాయి.
ALSO READ : Rs 2959 Cr Projes : బుల్లెట్ స్పీడ్ తో.. అభివృద్ధి Andhra Prabha Top Story
