విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం..

విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం..

కర్నూలు, ఆంధ్రప్రభ : ప్రజా ఫిర్యాదులపై సమగ్రంగా విచారణ జరిపి బాధితులకు చట్టపరంగా న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలపై పోలీసు అధికారులు త్వరితగతిన స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

కర్నూలు కొత్తపేటలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడిన ఎస్పీ, వారి సమస్యలను వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి మొత్తం 111 ఫిర్యాదులు అందాయి. వాటిలో ముఖ్యంగా ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.2.50 లక్షలు మోసం చేసిన ఘటన, డబ్బుల కోసం హనీట్రాప్‌కు గురిచేసిన కేసు, వ్యవసాయ భూముల ఆక్రమణతో పాటు ఫోర్జరీ, చీటింగ్ కేసులు, అనుమానాస్పదంగా కనిపించకుండా పోయిన వ్యక్తి అంశం, స్థల ఆక్రమణలపై ఫిర్యాదులు ప్రధానంగా ఉన్నాయి.

అందిన ప్రతి ఫిర్యాదును చట్టప్రకారం విచారించి బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యమని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) హుస్సేన్ పీరా, సీఐలు శివశంకర్, రామయ్య నాయుడు, రామాంజులు తదితరులు పాల్గొన్నారు.