జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రారంభోత్సవానికి ముమ్మర ఏర్పాట్లు
హెలిప్యాడ్, వ్యూ పాయింట్ పనులను పరిశీలించిన కలెక్టర్ డా. ఏ. సిరి
తుగ్గలి, ఆంధ్రప్రభ: తుగ్గలి మండలం పగిడిరాయి సమీపంలోని జియో మైసూర్ గోల్డ్ మైన్స్ ప్లాంట్‌ను ఈ నెల 24న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్, వ్యూ పాయింట్, బహిరంగ ప్రదేశాలు, భద్రతా ఏర్పాట్లను మంగళవారం జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో కొనసాగుతున్న పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. హెలిప్యాడ్ ప్రాంతంలో భద్రతా ప్రమాణాలు, పారిశుద్ధ్యం, రాకపోకల సౌకర్యాలు, తాగునీటి వసతి తదితర మౌలిక సదుపాయాలను పక్కాగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర స్థాయి ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యే అవకాశం ఉండటంతో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేపడుతున్నారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా జరిగేలా ప్రతి విభాగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
ఈ పరిశీలనలో జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొని ఏర్పాట్లపై కలెక్టర్‌కు వివరాలు అందించారు.
