ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి..
‘వన్ మంత్–ఫోర్ విజిట్’లో వినతుల స్వీకరణ
మహానందిలో ప్రత్యేక గ్రీవెన్స్ వేదిక.. అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశం
నంద్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ: ప్రజా సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా సూచించారు. శుక్రవారం మహానంది మండలంలోని కమ్మ సత్రంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డితో కలిసి ‘వన్ మంత్–ఫోర్ విజిట్’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికతో పాటు ప్రతి నెల ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేసి అక్కడ వరుసగా నాలుగు వారాల పాటు ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్జీలు సమర్పించిన ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
ఇళ్లు, ఇంటి స్థలాలు, పెన్షన్లు, రెవెన్యూ అంశాలు, భూ వివాదాలు తదితర ప్రజా సమస్యలను ఈ ప్రత్యేక వేదిక ద్వారా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు ప్రజా సమస్యల పరిష్కారాన్ని మరింత చేరువ చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. గతంలో జిల్లా కేంద్రానికే పరిమితమైన గ్రీవెన్స్ వ్యవస్థను ఇప్పుడు నియోజకవర్గ స్థాయికి విస్తరించడం వల్ల ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయని చెప్పారు. నెలలోని నాలుగు వారాల్లో ఒక్కో మండలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
స్వీకరించిన ప్రధాన వినతులు
మహానంది మండలం బొల్లవరం గ్రామానికి చెందిన ఉమ్మడి వెంకటస్వామి తన భూమిలో టీజీపీ కాలువ వెళ్లలేదని, సర్వే నిర్వహించి తన భూమిని తనకే కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
మహానంది గ్రామానికి చెందిన జి. వెంకటరమణ తమ తల్లి మరణించిందని, తండ్రి వదిలి వెళ్లిపోయాడని, నివాసానికి ఇల్లు కూడా లేదని పేర్కొంటూ గృహం మంజూరు చేయాలని కోరారు.
యు. బొల్లవరం గ్రామానికి చెందిన కే. మోహన్ తన పేరుపై ఉన్న సర్వే నంబర్ 232లోని 95 సెంట్ల భూమిలో రీ-సర్వే అనంతరం 29 సెంట్లు ఇతరుల పేరుపై నమోదయ్యాయని, తన భూమిని తిరిగి తన పేరుకు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా వివిధ సమస్యలపై ప్రజలు సమర్పించిన వినతులను పరిశీలించిన కలెక్టర్, వాటిని సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్‌మెంట్ జారీ చేసి ఆదేశాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, ఆర్డీవో విశ్వనాథ్‌తో పాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
