విదేశీ పర్యటనలు మానమన్న మోడీ వ్యాఖ్యలు హాస్యాస్పదం
విదేశీ పర్యటనలు మానమన్న మోడీ వ్యాఖ్యలు హాస్యాస్పదం
కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ విమర్శలు
కర్నూలు కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ ధర్నా
కర్నూలు, ఆంధ్రప్రభ : భారత ప్రజలు విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతామోహన్ విమర్శించారు. సోమవారం సాయంత్రం కర్నూలు కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ శ్రేణులతో కలిసి నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ వారానికి ఒకసారి విశ్రాంతి కోసం విదేశీ పర్యటనలకు వెళ్లి ఒక్కో పర్యటనకు రూ.15 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని, అలాంటి వ్యక్తి దేశ ప్రజలకు విదేశీ పర్యటనలు మానుకోవాలని సూచించడం విడ్డూరంగా ఉందన్నారు.

అంతేకాకుండా బంగారం కొనుగోలు తగ్గించుకోవాలని, వంటనూనెల వినియోగాన్ని తగ్గించుకోవాలని చెప్పడం ప్రజలను అవమానించే విధంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక సంస్కరణల ద్వారా దేశ విదేశీ మారక నిల్వలను బలోపేతం చేశామని, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో ఎరువులు, మందులు, సబ్బులు, బియ్యం, వంటనూనె, పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశముందని హెచ్చరించారు.
ప్రధాని వ్యాఖ్యలే దేశ ఆర్థిక పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చెప్పకనే చెబుతున్నాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆరు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నప్పటికీ గత ఎనిమిదేళ్లుగా పీఆర్సీ ఇవ్వకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి 12వ పీఆర్సీ ప్రకటించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.30 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేసి వారిని ఆదుకోవాలని కోరారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తాను అవినీతి సొమ్ము తీసుకోనని, తన మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా తీసుకోనివ్వనని ప్రకటించడం అభినందనీయమన్నారు. విజయ్ తరహాలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి కూడా అవినీతి వ్యతిరేక హామీ ఇవ్వగలరా అని ప్రశ్నించారు.
అమరావతి భవిష్యత్తులో మరో కర్నూలుగా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. రాజధానికి లక్ష ఎకరాల భూమి అవసరం లేదని, వెయ్యి ఎకరాలు సరిపోతాయని అభిప్రాయపడ్డారు. అమరావతి ప్రస్తుతం “చంద్రావతి”గా మారిందని, చంద్రబాబు నాయుడికి తప్ప రాయలసీమ ప్రజలకు అమరావతి ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. ధర్నా అనంతరం కాంగ్రెస్ నాయకులు కలెక్టరేట్‌లో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అశోక్ రత్నం, సమీ ఉల్లా, ఎస్సీ నాయకులు అశోక్ బాబు, నాగరాజు, సుంకన్న, వెంకటేష్, మునస్వామి, మహానంది, సాయిరాం, భరత్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
