5 నిమిషాలు ఆలస్యమైనా పర్వాలేదు.. డ్రైవింగ్‌లో నిర్లక్ష్యం వద్దు – జిల్లా ఎస్పీ

5 నిమిషాలు ఆలస్యమైనా పర్వాలేదు.. డ్రైవింగ్‌లో నిర్లక్ష్యం వద్దు – జిల్లా ఎస్పీ
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ :
“5 నిమిషాలు ఆలస్యమైనా పర్వాలేదు.. కానీ డ్రైవింగ్‌లో మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు” అని జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి వాహనదారులకు సూచించారు. రహదారి భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు జిల్లా పోలీసు శాఖ పటిష్ట చర్యలు చేపడుతోందని ఆయన తెలిపారు.
మంగళవారం ఆర్‌కే సోలార్ టెక్ సొల్యూషన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో అందజేసిన సోలార్ బ్లింకర్లు, ట్రాఫిక్ స్టాపర్స్‌ను జిల్లా ఎస్పీ ప్రారంభించారు. సంస్థల సహకారాన్ని ఆయన అభినందించారు.
జిల్లాలో జాతీయ రహదారి–16పై ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి 25 సోలార్ బ్లింకర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాత్రి వేళల్లో, పొగమంచు పరిస్థితుల్లో కూడా ఇవి ముందస్తు హెచ్చరికలుగా పనిచేస్తాయని చెప్పారు.
అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో అందిన 180 ట్రాఫిక్ స్టాపర్స్‌ను శ్రీకాకుళం, ఆముదాలవలస, నరసన్నపేట, టెక్కలి, కాశీబుగ్గ తదితర పట్టణాల్లోని రద్దీ కూడళ్లలో వినియోగించనున్నట్లు వెల్లడించారు.
ఈ చర్యల ద్వారా ట్రాఫిక్ నియంత్రణ, రద్దీ తగ్గింపు, పాదచారుల భద్రతకు తోడ్పాటు లభిస్తుందని ఎస్పీ పేర్కొన్నారు. వాహనదారులు హెల్మెట్, సీటుబెల్ట్ తప్పనిసరిగా వాడాలని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయకూడదని, వేగ నియంత్రణ పాటించాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి. శ్రీనివాసరావు, డీఎస్పీ వివేకానంద, ఆర్‌కే సోలార్ ప్రతినిధులు, ఎస్బీఐ అధికారులు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.
