జయశంకర్‌ను తెలంగాణ జాతిపితగా ప్రకటించాలి
నయింనగర్:, ఆంధ్రప్రభ: దివంగత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్‌ను తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వోపా (విశ్వబ్రాహ్మణ ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్) ప్రధాన సలహాదారు చొల్లేటి కృష్ణమాచార్యులు ప్రభుత్వాన్ని కోరారు. జయశంకర్ 92వ జయంతి సందర్భంగా హనుమకొండ బాలసముద్రంలోని జయశంకర్ స్మృతి వనంలో ఆయన విగ్రహానికి విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘం, వోపా నాయకులు పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా సామాజిక తెలంగాణ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ ఆచార్య అలుగోజు సదానందం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి జయశంకర్ అందించిన మార్గదర్శకత్వం చిరస్మరణీయమని అన్నారు. ఆయన క్రమశిక్షణ, నిస్వార్థ సేవ, ప్రజా చైతన్యం నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ పొడిచెట్టి విష్ణువర్థన్, మహేశ్వరం ప్రభాకర్, ఆకోజు సురేందర్‌రావు, పానుగంటి శ్రీధర్, రామోజు నాగసోమేశ్వరాచారి, రావులకొలను రామమూర్తి, కొక్కొండ రాధాకృష్ణ, కొత్తగట్టు వీరబ్రహ్మచారి, రాగి రవీందర్, పెద్దోజు ప్రభాకర్, నెక్కొండ మనోజ్, బండ్లోజు కోటేశ్వరాచారి, కందుకూరి ముకుందాచారి తదితరులు పాల్గొన్నారు.
