మొరం తవ్వకాలపై రెవెన్యూ సరిహద్దు వివాదం

హుమ్నాపూర్ శివారులో తవ్వకాలు నిలిపివేత.. ట్రాక్టర్‌కు రూ.80 వసూలు

వర్ని, ఆంధ్రప్రభ : మొరం తవ్వకాల విషయంలో రెవెన్యూ అధికారుల మధ్య సరిహద్దు వివాదం తలెత్తింది. వర్ని మండలం హుమ్నాపూర్ గ్రామ శివారులో జరుగుతున్న మొరం తవ్వకాలు చందూర్, వర్ని మండలాల రెవెన్యూ అధికారులకు సమస్యగా మారాయి.

హుమ్నాపూర్ గ్రామ శివారులో ఓ మహిళకు చెందిన భూమిలో మొరం తవ్వకాలకు చందూర్ రెవెన్యూ అధికారులు అనుమతులు ఇచ్చారు. అయితే ఆ భూమి తమ మండలంలోని ఘన్‌పూర్ గ్రామ శివారులో ఉందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. దీంతో మొరం తరలించే ప్రతి ట్రాక్టర్‌కు ఘన్‌పూర్ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో రూ.80 చొప్పున వసూలు చేస్తున్నట్లు సమాచారం.

పెద్ద ఎత్తున మొరం తవ్వకాలకు అనుమతులు ఇవ్వడంపై వర్ని తహసీల్దార్ చందూర్ రెవెన్యూ అధికారులతో చర్చించి తవ్వకాలను నిలిపివేయించారు. ఈ భూమికి సంబంధించి పలుమార్లు హద్దుల సర్వే చేయాలని కోరినా రెవెన్యూ అధికారులు స్పందించలేదని ఘన్‌పూర్ గ్రామస్తులు తెలిపారు.

ప్రస్తుతం మైనింగ్ శాఖ అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున మొరం తవ్వకాలకు అనుమతులు ఇవ్వకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు అనుమతులు మంజూరు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూముల సరిహద్దులపై సర్వే పూర్తయ్యే వరకు మొరం తవ్వకాలను నిలిపివేయాలని రెవెన్యూ అధికారులు నిర్ణయించారు.