సీఎంకి శుభాకాంక్షలు తెలిపిన జీపీవోలు..

సీఎంకి శుభాకాంక్షలు తెలిపిన జీపీవోలు..

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : గ్రామ పాలన ఆఫీసర్లకు (జీపీవో) సీనియర్ అసిస్టెంట్లుగా 40 శాతం పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం చేంగల్ గ్రామానికి చెందిన రాష్ట్ర జీపీవో ఆర్గనైజింగ్ సెక్రటరీ సంగేమ్ పృథ్వీరాజ్ అభినందించారు.

గతంలో రెవెన్యూ శాఖ నుంచి వేరుచేయబడి, చెట్టుకొకరు పుట్టకొకరుగా మారి మానసిక సంఘర్షణ అనుభవించిన వీఆర్ఏ, వీఆర్వోలకు ప్రస్తుత ప్రభుత్వం మరో శుభవార్త అందించిందని ఆయన పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్వ వీఆర్ఏ, వీఆర్వోలను మాతృ సంస్థ రెవెన్యూలోకి తీసుకోవడంతో పాటు వారిని జీపీవోలుగా నియమించిన విషయం తెలిసిందే.

తాజాగా గ్రామ పాలన ఆఫీసర్లకు 40 శాతం పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం జీవో ఎంఎస్ నెం. 74, తేదీ 29-04-2026 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం పట్ల సీఎం ఏ. రేవంత్ రెడ్డికి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్ కుమార్‌కు, సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి, టీజీఈజేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డికి రాష్ట్ర జీపీవో ఆర్గనైజింగ్ సెక్రటరీ సంగేమ్ పృథ్వీరాజ్ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ, గ్రామ పాలన ఆఫీసర్ల హక్కుల పరిరక్షణకు సహాయ సహకారాలు అందించిన టీజీఈజేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే 61 సంవత్సరాలు నిండిన వారి వారసులకు ఉద్యోగ కల్పన చేయాలని ప్రజా ప్రభుత్వాన్ని కోరారు. గ్రామ పాలన ఆఫీసర్లు మరింత నీతి, నిజాయితీతో ప్రభుత్వానికి, ప్రజలకు వారధులుగా పనిచేస్తారని ఆయన స్పష్టం చేశారు.