ఆస్తి కోసం అక్కను దారుణంగా హత్య చేసిన తమ్ముడు

సూర్యాపేట, ఆంధ్రప్రభ: ఆస్తి వివాదం కారణంగా తమ్ముడు అక్కను దారుణంగా హత్య చేసిన ఘటన ఆత్మకూరు మండలం తుమ్మల పెన్‌పహాడ్ గ్రామంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సురుగి అంజమ్మ భర్త మరణించగా, ఆమెకు పిల్లలు లేకపోవడంతో స్వగ్రామంలో తన చెల్లెలి ఇంట్లో నివసిస్తోంది. తనకు సేవలు చేస్తున్న చెల్లెలికి తన పేరిట ఉన్న రెండు ఎకరాల భూమిని ఇవ్వాలని అంజమ్మ నిర్ణయించడంతో, ఆమె తమ్ముడు సురుగి సైదులు గత కొన్ని సంవత్సరాలుగా వివాదానికి దిగుతున్నాడు.

తనకు కాకుండా చెల్లెలికి ఆస్తి ఇస్తానని అంజమ్మ చెప్పడంతో, ఆమెను హత్య చేస్తేనే ఆస్తి తనకు దక్కుతుందనే దురుద్దేశంతో సైదులు ఈ దారుణానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు.

సోమవారం ఉదయం అంజమ్మ ఉపాధి హామీ పనులకు వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన సైదులు కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలతో అంజమ్మ అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్పకూలి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply