అమరావతిపై జగన్ వ్యాఖ్యలతో వైసీపీకి మరింత నష్టం

ఎమ్మెల్యే గద్దె రామమోహన్
రూ.83 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు 60 మంది లబ్ధిదారులకు పంపిణీ.

కృష్ణలంక ,ఆంధ్రప్రభ : అమరావతిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు వైఎస్సార్‌సీపీకి మరింత రాజకీయ నష్టం కలిగిస్తున్నాయని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విమర్శించారు. రాష్ట్ర యువత భవిష్యత్తుకు కీలకమైన రాజధానిపై కుట్రలు చేయడం సరికాదన్నారు. తూర్పు నియోజకవర్గం 18వ డివిజన్ రాణిగారితోటలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో వైద్య చికిత్సల కోసం ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌) కింద 60 మంది లబ్ధిదారులకు రూ.83 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తూర్పు నియోజకవర్గంలోనే ఇప్పటివరకు రూ.16 కోట్లకు పైగా సీఎంఆర్‌ఎఫ్‌ సాయం అందించామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వైద్య సేవలు, సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాజధానిపై ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలను ప్రజలు నమ్మబోరని అన్నారు.