ఆపదలో అండగా.. అనారోగ్య బాధితులకు భరోసాగా సీఎంఆర్ఎఫ్

విజయవాడ పార్లమెంట్ పరిధి లో రూ.32.40 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన ఎంపీ చిన్ని
61 కుటుంబాలకు ఆర్థిక ఊరట!

విజయవాడ, ఆంధ్రప్రభ : ప్రజల కష్టాల్లో ప్రభుత్వం అండగా నిలవాలనే సంకల్పంతో అమలు చేస్తున్న ముఖ్యమంత్రి సహాయనిధి నిజమైన ఆపద్బాంధవుడిగా మారిందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పేర్కొన్నారు. అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ వైద్య ఖర్చులు భరించలేని పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందుతున్న సాయం వారి జీవితాల్లో కొత్త ఆశలు నింపుతోందన్నారు. గురువారం విజయవాడ పార్లమెంట్ పరిధిలోని విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాలతో పాటు తిరువూరు నియోజకవర్గంలోని అర్హులైన లబ్ధిదారులకు మొత్తం రూ.32,40,252 విలువ గల 61 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎంపీ చిన్ని పంపిణీ చేశారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా ప్రత్యేక శ్రద్ధతో వ్యవహరిస్తున్న ఎంపీ చిన్ని మరోసారి ప్రజల ప్రశంసలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ అనారోగ్యం ఒక్క కుటుంబాన్నే కాదనీ,ఆ కుటుంబ ఆర్థిక వ్యవస్థనే కుదేలు చేస్తుందని అలాంటి క్లిష్ట సమయంలో ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు, మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద భరోసాగా నిలుస్తోందన్నారు. డబ్బుల్లేవని ఎవరి వైద్య చికిత్స ఆగిపోకూడదన్నదే తమప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు.అర్హులైన ప్రతి కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ సాయం అందేలా నిరంతరం కృషి చేస్తున్నామన్నారు.

ప్రజలకు అవసరమైన ప్రతి సంక్షేమ పథకం వారి గడప వరకూ చేరేలా ప్రజాప్రతినిధిగా తన బాధ్యతను పూర్తి నిబద్ధతతో నిర్వర్తిస్తాను” అని స్పష్టం చేశారు.మండలాల వారీగా పంపిణీ చేసిన చెక్కుల వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ మండలంలో 8 మందికి రూ.8,55,118, ఎ.కొండూరు మండలంలో 6 గురికి రూ.3,50,665, గంపలగూడెం మండలంలో 25 మందికి రూ.10,40,232, విస్సన్నపేట మండలంలో 11 మందికి రూ.3,55,619, తిరువూరు మండలంలో 12 మందికి రూ.7,17,618 విలువైన చెక్కులను అందజేశారు.

మొత్తంగా 61 మంది లబ్ధిదారులకు రూ.32,40,252 ఆర్థిక సహాయాన్ని అందించారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందుకున్న లబ్ధిదారులు భావోద్వేగానికి లోనయ్యారు. క్లిష్ట సమయంలో ప్రభుత్వం అందించిన ఈ సాయం తమకు ఎంతో ఊరటనిచ్చిందని పేర్కొంటూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పట్ల కృతజ్ఞతలు తెలిపారు.ప్రజల కష్టాన్ని తన బాధగా భావిస్తూ,ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అర్హులైన ప్రతి కుటుంబానికి చేరవేయాలనే లక్ష్యంతో ఎంపీ కేశినేని చిన్ని నిరంతరం కృషి చేస్తుండటం విజయవాడ పార్లమెంట్ పరిధిలో ప్రజలకు మరింత భరోసాను కల్పిస్తోంది.