భూ పోరాటంలో డా. బోడ అనిల్ అరెస్ట్..

నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉప్పల్ బాగాయత్‌లో గురువారం నిర్వహించిన భూ పోరాట నిరసన కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రక్షణ సేన నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్ డా. బోడ అనిల్ కుమార్ నాయక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవితమ్మ పిలుపు మేరకు నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్రంలోని పలువురు ఉద్యమకారులు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ప్రతి అర్హ ఉద్యమకారుడికి 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమం ఉధృతంగా మారకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఘట్‌కేసర్ పోలీసులు డా. బోడ అనిల్ కుమార్ నాయక్‌తో పాటు పలువురు నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా డా. బోడ అనిల్ కుమార్ నాయక్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులను ప్రభుత్వం విస్మరించడం బాధాకరమన్నారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. డా. బోడ అనిల్ నాయక్ అరెస్ట్ విషయాన్ని తెలుసుకున్న నర్సంపేట నియోజకవర్గానికి చెందిన తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు ఖండిస్తూ, ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.