11% రిజర్వేషన్ ప్రకారం పదవులు కేటాయించాలి

11% రిజర్వేషన్ ప్రకారం పదవులు కేటాయించాలి
- కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ పిడమర్తి రవి
ఖమ్మం బ్యూరో, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో కులగణన లెక్కల ప్రకారం మాదిగ జనాభా అతిపెద్దది అని, దాదాపు 37 లక్షల జనాభా ఉందని, 11% ఉన్నటువంటి మాదిగలకు అన్ని విషయాల్లో అంతే శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు. ఖమ్మంలోని ప్రెస్ క్లబ్‌లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నుండి మాదిగలు ఐదు మంది మాత్రమే ఉన్నారని, ఎంపీలు, ఎమ్మెల్సీ లేరని, నామినేటెడ్ పోస్టుల్లో ఒకే ఒక మాదిగ ఉన్నాడని పేర్కొన్నారు.
ప్రభుత్వం చెప్పిన లెక్కలకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి అవకాశాలకు పొంతన లేకుండా పోయిందన్నారు. ఇకపై ప్రభుత్వం ఇచ్చే ఏ నియమకాలవైనా మాదిగలకు 11% వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. రానున్న నామినేటెడ్ పోస్టులలో, జిల్లా పరిషత్ ఎన్నికలలో జిల్లా పరిషత్ చైర్మన్గా మాదిగలకు 11 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతున్నామన్నారు.
- మధిర మా మాదిగల ఆత్మ గౌరవం ః టిపిసిసి మాజీ కార్యదర్శి వక్కలగడ్డ సోమ చంద్ర శేఖర్..
మధిర మా మాదిగల ఆత్మగౌరవమని టిపిసిసి మాజీ కార్యదర్శి వక్కలగడ్డ సోమ చంద్రశేఖర్ పేర్కొన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జనగణనచేయించి ఆ నివేదిక నివేదికను పబ్లిక్ డొమైన్ ద్వారా ప్రజలందరికీ అందుబాటులో తెచ్చి అందరి జాతకాలను బయటపెట్టిన మాదిగల పెద్దన్న, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాదిగ జాతి పక్షాన కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నానన్నారు.
రాష్ట్రంలోనే మాదిగ జాతి 37 లక్షలకు పైచిలుకు ఉందని, ఖమ్మం జిల్లాలో 2 లక్షలకు పైగా అతిపెద్ద కులంగా ఉందని అన్నారు. జిల్లాలో రెండు ఎస్సీ సీట్లలో మధిర మాల దాసరి 0.01 శాతం, సత్తుపల్లిలో మాల సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేగా ఉన్నారన్నారు. జిల్లాలో ఎస్సీలలో మూడింటి రెండువంతులు ఉన్న మాదిగలకు కనీసం ఏదులాపురం మున్సిపల్ చైర్మన్ కూడా దక్కకుండా కుట్రలు చేశారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే మధిరలో అత్యధిక మాదిగలు 60 వేల వరకు ఉన్నారని, అటువంటి చోట కూడా మాదిగ గాని, కనీసం మాల గాని లేరని, ఎస్సీ ఉపకులానికి చెందిన వారు ఎమ్మెల్యేగా ఉన్నారన్నారు.
దీనిపై పార్టీ పెద్దలు రాహుల్ గాంధీని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వాస్తవాలు తెలియజేస్తామన్నారు. మధిర నియోజవర్గం మాదిగల ఆత్మగౌరవమని, ఈసారి కచ్చితంగా మధిరను సాధించి తీరుతామన్నారు. ఖమ్మం జిల్లాలో ఉన్న రెండు ఎస్సీ సీట్లను మాదిగలకే సాధించి తీరుతామన్నారు. జిల్లాలో మాదిగలు ఎప్పుడూ కాంగ్రెస్ పక్షానే నిలబడి గెలుపులో కీలకపాత్ర పోషించారని, అటువంటి వారికి కనీసం ప్రాతినిధ్యం లేకపోవడమనేది అత్యంత దురదృష్టకరమని అన్నారు.
మాదిగలకు జరిగిన ఈ అన్యాయాన్ని వెంటనే భర్తీ చేయాలని, ప్రస్తుతం జరుగుతున్న కార్పొరేషన్ చైర్మన్ పదవులు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పదవుల్లో ఖవు్మం జిల్లా మాదిగలకు కేటాయించి న్యాయం చేయాలని కోరారు. ఖమ్మం జిల్లాలో మాదిగలకు జరిగిన అన్యాయాన్ని గురించి ముఖ్యమంత్రికి, టిపిసిసి అధ్యక్షులు దృష్టికి తీసుకువెళ్లి సత్వరమే న్యాయం జరిగే విధంగా వారు సిఫార్సు చేయాలని కోరుతున్నామన్నారు.
అదేవిధంగా బీసీ కులాలకు చెందిన వారు ఖమ్మం జిల్లాలో 50% పైగా ఉన్నారని, వారికి కూడా ఎంతో అన్యాయం జరిగిందని, రాబోయే ఎన్నికల్లో వారికి కూడా ఒక ఎమ్మెల్యే సీటు, ఖమ్మం లోక్‌సభ సీటును కేటాయించి ఆయా వర్గాలకు న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ సర్పంచ్ బొబ్బిలి భరత్ చంద్ర, కూసుమంచి మాజీ ఎంపీపీ ఎడవల్లి ముత్తయ్య, కనకం మైసయ్య, కోటవుర్తి భాస్కర్, జిల్లా ఎస్సీ సెల్ నాయకులు తొల రాకేష్, జిల్లా విజయకుమార్, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.
