ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం..
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం..
ప్రజా దర్బార్‌లో ఎమ్మెల్యే పందికుంట వెంకట ప్రసాద్
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పేర్కొంటూ గాండ్లపెంట మండలం గొడ్డువెలుగుల పంచాయతీలో నిర్వహించిన ‘ప్రజా దర్బార్’ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధి కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొన్నారు. గ్రామ ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి, వారి సమస్యలను ఓర్పుగా విని పరిష్కార మార్గాలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, కొత్త పింఛన్లు, తాగునీరు, రహదారులు, విద్యుత్ సమస్యలు వంటి పలు అంశాలపై అర్జీలు సమర్పించారు.
ప్రజలు అందించిన వినతులను క్షుణ్ణంగా పరిశీలించిన ప్రజాప్రతినిధి, సంబంధిత శాఖల అధికారులతో అక్కడికక్కడే మాట్లాడి మెజారిటీ సమస్యలకు తక్షణ పరిష్కారం చూపించారు. దీర్ఘకాలిక సమస్యలను ప్రత్యేకంగా గుర్తించి, వాటి పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవడం, వారి వద్దకే వెళ్లి సమస్యలను వినడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా అందేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజల చెంతకే పాలనను తీసుకెళ్లే లక్ష్యంతోనే ‘ప్రజా దర్బార్’ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరి సమస్య పరిష్కారం అయ్యే వరకు తన కృషి కొనసాగుతుందని హామీ ఇచ్చారు. ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందేలా అధికారులు పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో మండల అధికారులు, గ్రామ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల సిబ్బంది, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
