బూత్ కమిటీ బలోపేతమే లక్ష్యం.. కాంగ్రెస్ నేతలతో సమీక్ష
- ఓటరు జాబితా సవరణపై భట్టి కీలక సూచనలు
- సికింద్రాబాద్ కాంగ్రెస్ శ్రేణులకు భట్టి విక్రమార్క మార్గనిర్దేశం
- ప్రజాస్వామ్య బలోపేతంపై సమీక్ష సమావేశం
ఆంధ్రప్రభ, హైదరాబాద్ : ప్రజాభవన్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత బలోపేతం, ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ (SIR) కార్యక్రమం అమలు, బూత్ స్థాయి కమిటీల పటిష్ఠతపై కీలక దిశానిర్దేశం చేశారు.
ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ప్రతి కార్యకర్త కీలక పాత్ర పోషించాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. క్షేత్రస్థాయిలో సమన్వయంతో పని చేస్తూ ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. బూత్ స్థాయి కమిటీల పనితీరును మెరుగుపరచడం, క్షేత్రస్థాయి కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించడం వంటి అంశాలపై నాయకులకు మార్గనిర్దేశం చేశారు.
ఈ సమావేశానికి శాసనసభ్యులు దానం నాగేందర్, నవీన్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మోతే రోహిత్, దీపక్ జానుతో పాటు పలువురు కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థులు పాల్గొన్నారు.

