కేటీఆర్ పై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్..

  • ప్రజాధనాన్ని వృథా చేసి కాంగ్రెస్‌పై బురదజల్లడం సిగ్గుచేటు
  • కాళేశ్వరం అక్రమాలపై బీఆర్ఎస్ సమాధానం చెప్పాలి
  • మేడిగడ్డ కుంగుదల, అన్నారం–సుందిళ్ల లోపాలపై ఎందుకు మౌనం?
  • కేటీఆర్‌ను నిలదీసిన మంత్రి

ఆంధ్రప్రభ ప్రతినిధి , భూపాలపల్లి : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలు, బ్యారేజీల నిర్మాణ లోపాలు, లక్షల కోట్ల రూపాయల ప్రజాధన దుర్వినియోగంపై సమాధానం చెప్పాల్సిన బీఆర్ఎస్ నాయకులు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుతో కలిసి మంత్రి మాట్లాడారు.

కాళేశ్వరం పేరుతో లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేశారని, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ లోపాల కారణంగానే నేడు ఈ దుస్థితి ఏర్పడిందని ఆరోపించారు. దేశంలోనే అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్టుగా ప్రచారం చేసిన కాళేశ్వరం.. నేడు ప్రజల ముందే విఫలమైన ప్రాజెక్టుగా నిలిచిందని విమర్శించారు.

మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో లీకేజీలు, నిర్మాణ లోపాలపై జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ (ఎన్‌డీఎస్‌ఏ) నివేదిక స్పష్టంగా పేర్కొన్న అంశాలను బీఆర్ఎస్ నాయకులు ఎందుకు దాచిపెడుతున్నారని ప్రశ్నించారు. తాము చేసిన తప్పులను అంగీకరించకుండా రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

కన్నెపల్లి పర్యటన పేరుతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకేనని, కాళేశ్వరం వైఫల్యాలకు పూర్తిగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకొస్తోందని, అక్రమాలకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రాజెక్టులను రాజకీయ ప్రయోజనాల కోసం నాశనం చేసిన వారిని ప్రజలు ఎప్పటికీ క్షమించరని, రాష్ట్ర ప్రయోజనాలే కాంగ్రెస్ ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట జరిగిన అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని, ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలను బీఆర్ఎస్ వెంటనే మానుకోవాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో పనిచేస్తోందని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొంరయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.