రాగల 4–5 రోజులు భారీ వర్షాలు

  • తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల అలర్ట్..
  • ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ..
  • తీర ప్రాంతాలకు ఈదురుగాలుల హెచ్చరిక

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో వాతావరణం మారిపోతోంది. రాగల రెండు నుంచి మూడు గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

తెలంగాణలో జనగాం, ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే రాగల 12 గంటల్లో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు.

రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లుండి కూడా ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ సహా పలు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కొనసాగుతాయని పేర్కొంది. అదేవిధంగా బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

బ‌ల‌ప‌డుతున్న వాయుగుండం…

ఇక ఆంధ్రప్రదేశ్‌లో వాయుగుండం ప్రభావంతో వాతావరణ పరిస్థితులు మరింత తీవ్రంగా మారనున్నాయి. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం ఉత్తర ఒడిశా–పశ్చిమ బెంగాల్ తీరానికి సమీపంలో కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది పశ్చిమ–వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

దీని ప్రభావంతో విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న వారు వెంటనే తీరానికి చేరుకోవాలని సూచించారు. అలాగే చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర నిలబడకూడదని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని హెచ్చరించారు.

పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

రాబోయే 4–5 రోజులు దేశవ్యాప్తంగా విస్తారంగా నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఒకేసారి ఐదు వాతావరణ వ్యవస్థలు క్రియాశీలంగా ఉండటంతో ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. వీటిలో అత్యంత ప్రభావవంతమైనది వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం.

ఇది రాబోయే మూడు రోజుల్లో ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ–వాయవ్య దిశగా కదులుతూ మధ్య భారత ప్రాంతాల్లో భారీ వర్షాలకు కారణమవుతుందని ఐఎండీ తెలిపింది. ఛత్తీస్‌గఢ్, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది.

అలాగే, బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, జమ్మూ-కాశ్మీర్, లడఖ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, పంజాబ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం వంటి రాష్ట్రాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

ప్రజలు అనవసర ప్రయాణాలు చేయకుండా ఉండాలని, తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక వాతావరణ శాఖ సూచనలను తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు.