ప్రభుత్వ చర్యలతో పొగాకు మార్కెట్‌లో కదలిక.. రైతులకు ఊరటనిస్తున్న పెరిగిన ధరలు
ప్రభుత్వ చర్యలతో పొగాకు మార్కెట్‌లో కదలిక.. రైతులకు ఊరటనిస్తున్న పెరిగిన ధరలు
- పొగాకు కొనుగోళ్లలో సానుకూల ధోరణి
- తగ్గుతున్న నోబిడ్లు.. పెరుగుతున్న ధరలు
- ధర లోటు భర్తీకి బోనస్‌పై ప్రభుత్వ నిర్ణయం
- కొనుగోళ్లపై సీఎం చంద్రబాబు నిరంతర సమీక్షలు
- పొగాకు రైతుల్లో మళ్లీ చిగురిస్తున్న ఆశలు
సంక్షోభంలో చిక్కుకున్న పొగాకు రైతులకు ఊరట కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు క్రమంగా ఫలితాలు ఇస్తున్నాయనే సంకేతాలు పొగాకు వేలం కేంద్రాల్లో కనిపిస్తున్నాయి.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పొగాకు కొనుగోళ్ల పరిస్థితిపై ప్రభుత్వం నిరంతరం సమీక్షలు నిర్వహిస్తుండగా, కేంద్ర ప్రభుత్వంతో జరిపిన సంప్రదింపుల ప్రభావం వేలం కేంద్రాల్లో కనిపించడం ప్రారంభమైందని రైతులు పేర్కొంటున్నారు.
ఇటీవల వరకు అధికంగా నమోదైన నోబిడ్లు బుధవారం నాటికి కొంత తగ్గగా, రోజువారీ కొనుగోలు పరిమాణం కూడా పెరిగింది. దీంతో రైతుల్లో కొంతమేర ఆశావహ వాతావరణం నెలకొంది.
ఒంగోలు ప్రాంతంలోని వేలం కేంద్రాల్లో గత రెండు రోజుల్లో సుమారు 0.51 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు జరగగా, సగటున కిలోకు రూ.188 ధర లభించింది. అదే రోజు దాదాపు 32 శాతం బేళ్లు నోబిడ్లు అయ్యాయి.
బుధవారం మాత్రం కొనుగోలు పరిమాణం 0.65 మిలియన్ కిలోలకు పెరగడంతో పాటు, సగటు ధర కిలోకు రూ.194.90కు చేరుకుంది. నోబిడ్లు 27 శాతానికి తగ్గడం రైతులకు కొంత ఊరటనిచ్చింది.
మెరుగుపడుతున్న ధరలు
ప్రత్యేకంగా ఎస్పీఎస్ రీజియన్‌లో ధరలు మెరుగుపడినట్లు రైతులు చెబుతున్నారు. అక్కడ సగటున కిలోకు రూ.196 వరకు ధర లభించింది.
అయితే ఇదే రీజియన్‌లోని వెల్లంపల్లి వేలం కేంద్రంలో ఆశించిన స్థాయిలో ధరలు రావడం లేదని కొందరు రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఐదు వేలం కేంద్రాల్లో సుమారు 4 వేల బేళ్లు వేలానికి రాగా, అందులో 2,500 బేళ్లు కొనుగోలు చేశారు. సగటున కిలోకు రూ.194.60 ధర లభించగా, సుమారు 28 శాతం బేళ్లు నోబిడ్లు అయ్యాయి.
మరోవైపు ఒంగోలు పరిధిలోని ఆరు కేంద్రాల్లో సుమారు 3 వేల బేళ్లు వేలానికి రాగా, 2,200 బేళ్లు కొనుగోలు చేశారు. అక్కడ సగటున కిలోకు రూ.195 ధర నమోదైంది.
రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా ప్రభుత్వం అన్ని స్థాయిల్లో చర్యలు చేపడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పొగాకు కొనుగోళ్లపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు.
ధర లోటు భర్తీకి బోనస్
ధరల లోటు భర్తీ కోసం బోనస్, వడ్డీ లేని రుణాలు, ఇతరత్రా అంశాలను పరిశీలనలోకి తీసుకున్నారు.
అదేసమయంలో ఇకనుంచి అయినా గ్రేడ్‌లో బేస్ ధర నిర్ణయించి, ధర లోటుకు బోనస్ ఇవ్వాలని రైతులు పట్టుబట్టారు.
ఈ నేపథ్యంలో మేలురకం కిలో రూ.240, మీడియం గ్రేడ్‌కు రూ.190, లో గ్రేడ్‌కు రూ.110ను బేస్ ధరలుగా నిర్ణయించారు. లో గ్రేడ్‌లో కొంత మెరుగ్గా ఉండే స్టెబ్రకానికి కిలో రూ.160 తగ్గకుండా కూడా నిర్ణయించినట్లు సమాచారం.
అదేసమయంలో రైతుల వద్ద నిల్వ ఉన్న పంటలో లో గ్రేడ్ ధర లోటు కింద కిలోకు రూ.20 ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రంలో మొత్తం 94 మిలియన్ కిలోల లో గ్రేడ్‌కు కిలోకు రూ.20 చొప్పున రూ.188 కోట్ల బోనస్ ఇవ్వాలని నిర్ణయించడం రైతులకు ఉపశమన చర్యగా చెబుతున్నారు.
నిరంతర సమీక్షలు
రైతులకు నష్టం జరగకుండా కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు, కేంద్ర వ్యవసాయ శాఖతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నారు.
ఎగుమతులు, మార్కెట్ అవకాశాల విస్తరణ, కొనుగోలు సంస్థల భాగస్వామ్యం పెంపు వంటి అంశాలపై కేంద్రం సహకారం కోరుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
ప్రభుత్వ జోక్యంతో వేలం కేంద్రాల్లో పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని రైతులు చెబుతున్నారు. అయితే నోబిడ్లు మరింత తగ్గి, అన్ని గ్రేడ్లకు ఆశించిన స్థాయిలో ధరలు లభించేలా చర్యలు కొనసాగించాలని వారు కోరుతున్నారు.
ప్రస్తుతం కనిపిస్తున్న సానుకూల ధోరణి కొనసాగితే పొగాకు రైతులకు మరింత ఉపశమనం లభించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
