ఎన్నికల ఫలితాలతో ఎన్డీఏ పట్టు బలపడింది
ఎన్నికల ఫలితాలతో ఎన్డీఏ పట్టు బలపడింది
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ ప్రతినిధి: దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అంచనాలను మించాయి. బెంగాల్‌ను బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. అసోంలో మరోసారి ఏకపక్షంగా విజయం సాధించింది. పుదుచ్చేరిలో ఎన్డీఏ అధికారంలోకి రానుంది. కేరళలో మాత్రం కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అధికారం చేపట్టబోతోంది. తమిళనాడులో 40 ఏళ్లుగా కొనసాగుతున్న డీఎంకే, అన్నాడీఎంకే పాలనను కేవలం రెండేళ్లలోనే విజయ్ నేతృత్వంలోని టీవీకే తుడిచిపెట్టేసి షాక్ ఇచ్చింది.
ప్రస్తుత రాజకీయ దృశ్యాన్ని పరిశీలిస్తే, ఇండియా కూటమి బలహీనపడుతున్నట్లు కనిపిస్తోంది. ఇందులో ప్రధాన భాగస్వాములైన తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే పార్టీలు ఘోర పరాజయం చవిచూశాయి. 2029 లోక్‌సభ ఎన్నికల వరకు ఈ కూటమి కొనసాగుతుందా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ, డీఎంకే పార్టీలు కలిసి బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పరచుకున్నాయి. ఆ సమయంలో కొంత మేర ఫలితాలను సాధించినప్పటికీ, బీజేపీని పూర్తిగా అడ్డుకోలేకపోయాయి. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ వరుస విజయాలతో ముందుకు సాగుతోంది.
హర్యానా, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయాలు సాధించింది. ఎన్డీఏ కూటమిగా బీజేపీ తన బలాన్ని మరింతగా చాటుతోంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీని అధికారం నుంచి దించడం ద్వారా ప్రభావాన్ని స్పష్టంగా చూపించింది. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఈ విజయాల ప్రభావం 2029 వరకు కనిపిస్తుందని వ్యాఖ్యానించారు.
హిందీ, హిందూ వ్యతిరేక భావజాలం ఎక్కువకాలం పనిచేయదని డీఎంకే గుర్తుంచుకోవాల్సిన సమయం వచ్చింది. మైనారిటీ సంతుష్టీకరణ ఎల్లప్పుడూ ఫలితాలను ఇవ్వదనే విషయాన్ని బెంగాల్ ఎన్నికలు మరోసారి రుజువు చేశాయి. అలాగే తమిళనాడులో డీఎంకే నేతల హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు, విధానాలు కూడా వారి ఓటమికి కారణమయ్యాయి. డీఎంకేపై పెరిగిన వ్యతిరేకత టీవీకేకు అనుకూలంగా మారింది. దీంతో ఇటీవల వరకూ అధికారంలో ఉన్న డీఎంకే ఇప్పుడు మూడో స్థానానికి పరిమితం కావడం గమనార్హం.
రాబోయే యూపీ ఎన్నికలపై ప్రభావం..
ప్రస్తుత రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే, ఇండియా కూటమి క్రమంగా క్షీణిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఎన్నికల ఫలితాలు రాబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆ రాష్ట్రంలో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ అధికారానికి దూరంగా ఉంది. బీహార్‌లో ఆర్జేడీ బలహీనపడింది. కాంగ్రెస్ కూడా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించలేకపోతోంది. మొత్తానికి, ఇండియా కూటమి ఒకవైపు క్షీణిస్తుండగా, బీజేపీ మాత్రం తన బలాన్ని మరింతగా పెంచుకుంటూ ముందుకు సాగుతోంది.
