తొలితరం ఖమ్మం కరస్పాండెంట్‌ సాంబశివారెడ్డి అస్తమయం

విద్యారంగంలో ఐదు దశాబ్దాల సేవ..

వేలాది మంది విద్యార్థులకు మార్గదర్శి

ఖమ్మం ఎడ్యుకేషన్, ఆంధ్రప్రభ: ఉమ్మడి ఖమ్మం జిల్లా తొలితరం కరస్పాండెంట్‌, వేలాది మంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చిన విద్యావేత్త, ఖమ్మం నిర్మల్‌ హృదయ్‌ పాఠశాల కరస్పాండెంట్‌ వంగా సాంబశివారెడ్డి ఆదివారం ఉదయం మృతి చెందారు. స్వగృహంలో గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో పాటు పలువురు పాఠశాలలు, కళాశాలల చైర్మన్లు, కరస్పాండెంట్లు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసిన అనంతరం ఉద్యోగం కోసం ప్రభుత్వాలపై ఆధారపడకుండా సొంతంగా విద్యాసంస్థను ఏర్పాటు చేసి ఐదు దశాబ్దాలుగా విలువలతో కూడిన క్రమశిక్షణాయుత విద్యను అందించిన సాంబశివారెడ్డి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. 1970లో కొత్తగూడెం జూనియర్‌ కళాశాలలో లెక్చరర్‌గా, అనంతరం ఖమ్మం సిద్ధారెడ్డి కళాశాలలో లెక్చరర్‌గా పనిచేశారు. 1978లో నిర్మల్‌ హృదయ్‌ పాఠశాలను స్థాపించారు. పాఠశాలను నిర్వహిస్తూనే శారద జూనియర్‌ కళాశాల, వివేకానంద జూనియర్‌ కళాశాలలకు ప్రిన్సిపల్‌గా సేవలందించి అనంతరం నిర్మల్‌ హృదయ్‌ పాఠశాలకే పూర్తిస్థాయిలో అంకితమయ్యారు. తల్లిదండ్రుల ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకుని తక్కువ ఫీజులతో అత్యుత్తమ విద్యా ప్రమాణాలు అందిస్తూ ప్రతి ఏటా పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించేలా పాఠశాలను తీర్చిదిద్దారు.

విద్యార్థులకు క్రమశిక్షణ, సత్ప్రవర్తన, ఉన్నత విలువలను నేర్పుతూ ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దేందుకు సాంబశివారెడ్డి చేసిన కృషి మార్గదర్శకంగా నిలిచింది. ఆయన కుమారుడు సుధాకర్‌రెడ్డి, కోడలు పద్మజతో కలిసి నిర్మల్‌ హృదయ్‌ పాఠశాలను రాష్ట్రంలోనే ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యాసంస్థగా తీర్చిదిద్దారు. ఈ పాఠశాలలో చదువుకున్న పలువురు విద్యార్థులు సివిల్‌ సర్వెంట్లుగా, దేశ విదేశాల్లో ఉన్నతాధికారులుగా, వివిధ రంగాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడి సమాజ సేవ చేస్తున్నారు. ప్రస్తుత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సహా పలువురు ప్రజాప్రతినిధులు ఆయన వద్ద విద్యాభ్యాసం చేశారు. సొంత పాఠశాల నిర్వహణకే పరిమితం కాకుండా ఉమ్మడి జిల్లా, రాష్ట్రంలోని ఇతర కరస్పాండెంట్లను ఏకం చేసి బడ్జెట్‌ పాఠశాలల సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేశారు. విద్యా సేవలకు గుర్తింపుగా ఇటీవల కార్గిల్‌ విజయ్‌ దివస్‌ కార్యక్రమంలో జిల్లా ఇంటెలిజెన్స్‌ ఎస్పీ రామోజీ రమేష్‌ చేతుల మీదుగా గౌరవ విద్యాసేవ పురస్కారం అందుకున్నారు. ఐదు దశాబ్దాలుగా విద్యార్థులకు గురువుగా, కరస్పాండెంట్‌గా సేవలందించిన సాంబశివారెడ్డి మృతి విద్యారంగానికి తీరని లోటని పలువురు పేర్కొన్నారు. ఆయన మృతికి బేబీ మూన్‌ వీరన్న, లిటిల్‌ ఫ్లవర్స్‌ అరుణ్‌, గీతాంజలి టీవీ అప్పారావు, న్యూ ఇరా ఐవీ రమణ, బీబీఎం కాంతారావు, శ్రీవాణి రామచంద్రరావు, న్యూ విజన్‌ ప్రసాద్‌, హార్వెస్ట్‌ రవి మారుత్‌, ఆక్స్‌ఫర్డ్‌ స్కూల్‌ మతిన్‌, రెజోనెన్స్‌ స్కూల్‌ ఆర్‌.వి. నాగేంద్రకుమార్‌, కొండా శ్రీధర్‌రావు, స్మార్ట్‌ కిడ్జ్‌ చింతనిప్పు కృష్ణచైతన్య, వండర్‌ కిడ్స్‌ శశిధర్‌రెడ్డి, టైనీటాట్స్‌ భాస్కర్‌, న్యూ విక్టరీ మోహన్‌రెడ్డి, శ్రీ విద్యానికేతన్‌ గొల్లపూడి రాంప్రసాద్‌, ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ రవీందర్‌రెడ్డి, బ్లూమింగ్‌ మైండ్స్‌ అశోక్‌రెడ్డి, విన్‌ఫీల్డ్‌ స్కూల్‌ కిషోర్‌, క్రియేటివ్‌ స్కూల్‌ కమలాకర్‌, అభినవ్‌ స్కూల్‌ రమణ, త్రివేణి స్కూల్‌ వీరేందర్‌ చౌదరి, ఇగ్నైట్‌ స్కూల్‌ మాధవరావు తదితరులు ఘన నివాళులర్పించారు.