రకరకాల ఆఫర్ల పేరుతో కలర్ఫుల్గా కనిపిస్తున్న ఈ పోస్టర్ల వెనుక పెద్ద సైబర్ మోసం
సైబర్ కేటుగాళ్లు విసురుతున్న కొత్త డేటింగ్ ట్రాప్
హైదరాబాద్, ఆంధ్రప్రభ: “ఒంటరితనంగా ఉందా? మీతో కాఫీ తాగడానికి, సినిమాకు వెళ్లడానికి అందమైన అబ్బాయి కావాలా? అది కూడా 50 శాతం ఆఫర్‌తో!”.. సోషల్ మీడియాలో ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఇలాంటి ప్రకటనలను చూసి అమ్మాయిలు, యువతులు ఏమాత్రం తొందరపడొద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. ‘రెంట్ బాయ్‌ఫ్రెండ్’ పేరుతో వస్తున్న ఆఫర్ల వెనుక సైబర్ మోసగాళ్ల వల ఉండే అవకాశం ఉందని ఆయన అప్రమత్తం చేశారు. ఇలాంటి పరిచయాలు చివరకు డబ్బు మోసంతో పాటు వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసి బ్లాక్‌మెయిల్‌కు దారితీసే ప్రమాదం ఉందని సూచించారు.
ఆకర్షణీయ ఆఫర్లతో వల..
ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో ‘రెంట్ బాయ్‌ఫ్రెండ్’, ‘పర్సనల్ కంపానియన్’ పేరుతో రకరకాల ప్రకటనలు కనిపిస్తున్నాయి. “50 శాతం డిస్కౌంట్”, “స్పెషల్ ఆఫర్” అంటూ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అందమైన యువకుల ఫొటోలు, చాటింగ్, కాఫీ మీటింగ్, సినిమా డేట్ వంటి పదాలతో యువతులను ఆకట్టుకునేలా ఈ ప్రకటనలను రూపొందిస్తున్నారు.
కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తున్న ఫొటోలు నిజమైన వ్యక్తులకు సంబంధించినవి కాకపోవచ్చని, ఏఐతో రూపొందించినవి లేదా ఇంటర్నెట్ నుంచి సేకరించినవిగా ఉండొచ్చని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇదే తరహాలో నకిలీ ప్రొఫైళ్ల ద్వారా యువతులను పరిచయం చేసుకుని, నమ్మకం ఏర్పడిన తర్వాత వ్యక్తిగత ఫొటోలు, ఇతర వివరాలను సేకరించే మోసాలపై సజ్జనార్ గతంలోనూ హెచ్చరించారు.
ముందు బుకింగ్.. ఆ తర్వాత మోసం!
బుకింగ్ పేరుతో ముందుగా కొంత మొత్తం చెల్లించాలని, సెక్యూరిటీ డిపాజిట్ లేదా అడ్వాన్స్ ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. డిజిటల్ చెల్లింపులు, క్యూఆర్ కోడ్లు, ఇతర ఆన్లైన్ మార్గాల ద్వారా డబ్బులు పంపించిన తర్వాత సంబంధిత వ్యక్తులు స్పందించకుండా పోవచ్చు. మరికొన్ని సందర్భాల్లో చాటింగ్ ద్వారా సేకరించిన వ్యక్తిగత సమాచారాన్ని అడ్డుపెట్టుకుని బాధితులను బెదిరించే ప్రమాదం కూడా ఉంది.
ఒక్కసారి నమ్మితే.. చిక్కుల్లో పడే ప్రమాదం
ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తి చెప్పే మాటలను పూర్తిగా నమ్మి నేరుగా కలవడానికి వెళ్లడం కూడా ప్రమాదకరమే. ముఖ్యంగా వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, వీడియోలు, ఫోన్ నంబర్లు, నివాసం లేదా కుటుంబానికి సంబంధించిన సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. నకిలీ గుర్తింపులతో యువతులను పరిచయం చేసుకుని, ఆ తర్వాత ప్రైవేట్ ఫొటోలు, వీడియోల పేరుతో బెదిరింపులకు పాల్పడే ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.
తల్లిదండ్రులూ.. ఓ కన్నేసి ఉంచండి
యువతులే కాకుండా తల్లిదండ్రులు కూడా పిల్లల సామాజిక మాధ్యమాల వినియోగంపై అవగాహనతో ఉండాలని సజ్జనార్ సూచించారు. పిల్లలు ఎలాంటి ఖాతాలను అనుసరిస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? అనుమానాస్పద పరిచయాలు ఏమైనా ఉన్నాయా? వంటి అంశాలను గమనిస్తూ, సమస్య ఎదురైతే భయపడకుండా కుటుంబ సభ్యులతో పంచుకునే వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని పోలీసులు సూచిస్తున్నారు.
“ఆకర్షణీయమైన ఆఫర్ కనిపించిందని వెంటనే స్పందించొద్దు. అపరిచితులను నమ్మొద్దు. ముందస్తుగా డబ్బులు చెల్లించొద్దు. వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దు” — ఇదే ఈ తరహా మోసాల విషయంలో ప్రధాన జాగ్రత్త.
ఇలాంటి మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా 1930కు ఫిర్యాదు చేయడం లేదా జాతీయ సైబర్ నేరాల ఫిర్యాదు వ్యవస్థను ఆశ్రయించడం మంచిది. ముఖ్యంగా డబ్బు పోయిన వెంటనే ఫిర్యాదు చేస్తే లావాదేవీని అడ్డుకునే అవకాశాలు మెరుగుపడతాయి.
