కడెం ప్రాజెక్టు నీటిని పొదుపుగా వినియోగించాలి
- రైతులకు సాగునీరు విడుదల చేసిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు
- నీటి విషయంలో బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు రైతులను రెచ్చగొడుతున్నారు: ఎమ్మెల్యే
కడెం, ఆగస్టు 9 (ఆంధ్రప్రభ): కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు నీటిని రైతులు పొదుపుగా వినియోగించుకోవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సూచించారు. ఆదివారం కడెం ప్రాజెక్టు నుంచి ఆయకట్టు పరిధిలోని ప్రధాన కాలువలకు సాగునీటిని విడుదల చేశారు. నీటిపారుదల శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే ఎడమ, కుడి కాలువలకు నీటిని వదిలారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవడం లేదని, ఖరీఫ్‌లో రైతులు పంటల సాగుపై ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికే రైతులకు అవగాహన కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు.
కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టంతో నిండినా సాగునీటిని విడుదల చేయడం లేదని, నీటిని వృథాగా గోదావరిలోకి వదులుతున్నారని బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. ప్రాజెక్టు నీటి లభ్యతపై అవగాహన లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.
కడెం ఆయకట్టు కింద వరి సాగు చేపడితే పంటకు అవసరమైన సమయంలో విడతల వారీగా నీరు అందించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం వర్షాలు లేకపోతే జలాశయంలో నీటి నిల్వలు తగ్గిపోయి భవిష్యత్‌లో తాగునీరు, పంటల సాగుకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. అందువల్ల అందుబాటులో ఉన్న నీటిని రైతులు జాగ్రత్తగా వినియోగించుకోవాలని కోరారు.
ప్రాజెక్టులో భారీగా పూడిక పేరుకుపోయిందని ఎమ్మెల్యే తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో కడెం ప్రాజెక్టు అభివృద్ధిపై తగిన శ్రద్ధ చూపలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.9.40 కోట్ల నిధులు మంజూరు చేసి వరద గేట్ల మరమ్మతులు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు.
సాగునీటి విడుదలలో కొంత ఆలస్యం జరిగిందని, అయితే రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కడెం ప్రాజెక్టు ప్రధాన కాలువతో పాటు సదర్‌మాట్ కాలువ పనులను కూడా పూర్తి చేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో కడెం ప్రాజెక్టు ఈఈ ప్రవీణ్‌కుమార్, డీఈ వీరన్న, ఏఈలు, ఖానాపూర్, జన్నారం ఏఎంసీ చైర్మన్లు పి.భూషణ్, లక్ష్మీనారాయణ, నిర్మల్ డీసీసీ ప్రధాన కార్యదర్శి పి.సతీష్‌రెడ్డి, పాండవపూర్ పీఏసీఎస్ చైర్మన్ రామడుగు శైలజ రమేష్‌రావు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు బొడ్డు గంగన్న, నందు నాయక్, ఆర్.రమేష్‌రావు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు జొన్నల చంద్రశేఖర్, యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి ముడికే మల్లేష్‌యాదవ్, మండల అధ్యక్షుడు రెంకల శ్రీనివాస్‌యాదవ్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కట్ట శ్యాంసుందర్, మంచిర్యాల డీసీసీ ఉపాధ్యక్షుడు జి.మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

