శాశ్వత అన్నదాన పథకానికి దాతల చేయూత
- రూ.లక్ష చొప్పున ఐదుగురు దాతల విరాళం…
- ప్రతి శనివారం 600 మందికి పైగా భక్తులకు అన్నప్రసాద వితరణ
మైలవరం, ఆంధ్రప్రభ : మైలవరం పట్టణంలోని ద్వారకాతిరుమల దేవస్థాన దత్తత దేవాలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణకు భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. దేవస్థాన చైర్మన్ ఎస్.వి. సుధాకర్ రావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద కార్యక్రమంలో ప్రతి శనివారం 600 మందికి పైగా భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. ఈ సేవా కార్యక్రమాన్ని మరింత నిరంతరంగా కొనసాగించేందుకు ఇటీవల ప్రవేశపెట్టిన శాశ్వత నిత్య శనివారం అన్నదాన పథకంలో చేరేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగా ఐదుగురు దాతలు రూ.లక్ష చొప్పున విరాళాలను అందించినట్లు ద్వారక తిరుమల దేవస్థానం చైర్మన్ ఎస్.వి. సుధాకర్ రావు తెలిపారు.
విరాళాలు అందించిన వారిలో పెన్మత్స ఈశ్వర వర్మ మౌనిక (ద్వారకాతిరుమల), కోటగిరి ముత్తయ్యాచారి లక్ష్మి తిరుపతమ్మ (మైలవరం), నుచ్చు వెంకట పానకాలరావు–సత్యవతిదేవి (మైలవరం), చింతా శ్రీహ్రియన్–శివాని (పొందుగల), మల్లెల వెంకటేశ్వరరావు–పున్నమ్మ (మైలవరం) ఉన్నారు. ప్రతి ఒక్కరూ రూ.లక్ష చొప్పున, మొత్తం రూ.5 లక్షలు శాశ్వత అన్నదాన పథకానికి విరాళంగా అందించినట్లు సుధాకర రావు పేర్కొన్నారు. భక్తులకు అన్నప్రసాదాన్ని అందించడం ద్వారా ఆధ్యాత్మిక సేవతో పాటు సామాజిక సేవకు దాతలు తమ వంతు సహకారం అందిస్తున్నారని ఆయన తెలిపారు. శాశ్వత అన్నదాన పథకానికి మరింత మంది దాతలు ముందుకు వచ్చి భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
