డీటీఓ వెంకన్నకు కొవ్వొత్తులతో ఘన నివాళి
జగిత్యాల, ఆంధ్రప్రభ: రవాణా శాఖలో కర్తవ్యనిర్వహణలో నిబద్ధత, మానవత్వంతో పేరు తెచ్చుకున్న భూపాలపల్లి డీటీఓ వెంకన్న అకాల మరణం పట్ల తెలంగాణ రికగనైజషన్ స్కూల్ మేనేజ్ మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ట్రస్మా జిల్లా అధ్యక్షులు శ్రీధర్‌రావు మాట్లాడుతూ,భూపాలపల్లి డీటీఓ వెంకన్నతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన సేవలను కొనియాడుతూ, విధి నిర్వహణలో నిజాయితీ, క్రమశిక్షణకు ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన మరణం రవాణా శాఖకు తీరని లోటని అన్నారు.
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షులు చీటి శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ.. వెంకన్న కేవలం అధికారిగా కాకుండా మానవత్వంతో అందరినీ ఆదరించే వ్యక్తిగా గుర్తుండిపోతారని అన్నారు. ఎవరినైనా ఎంతో ప్రేమగా పలకరించే మంచి మనసున్న అధికారి అని కొనియాడారు. ఆయన కుటుంబానికి, ముఖ్యంగా వారి పిల్లలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలవాలని కోరారు.
డీటీవో సంధాని మాట్లాడుతూ.. ఇటీవలే బదిలీపై వెళ్లిన వెంకన్న విధి నిర్వహణలోనే అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన సేవలను రవాణా శాఖ ఎప్పటికీ మరవలేదని పేర్కొన్నారు.అనంతరం ట్రస్మా ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి మౌనం పాటించి వెంకన్న చిత్రపటానికి నివాళులు ఘటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు రామారావు, సాయికిరణ్, రియాజ్, ట్రస్మా బాధ్యులు రవిప్రసాద్, గంగారెడ్డి, జగన్ మోహన్‌రెడ్డి, రాజుగౌడ్, రవీందర్, రాబర్ట్, రాంబాబు, రాజేందర్, విలేకరులు, అభిమానులు, రవాణా శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
