రాష్ట్రపతి పర్యటనకు పటిష్ట బందోబస్తు: ఎస్పీ సమీక్ష
అనంతపురం, ఆంధ్రప్రభ: జూలై 1న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనంతపురం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. బుక్కరాయసముద్రం మండలం జంతలూరులోని కేంద్ర విశ్వవిద్యాలయంలో జరిగే స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ పి. జగదీష్ మంగళవారం కేంద్ర విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
అనంతరం బందోబస్తు విధుల్లో పాల్గొనే పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించిన ఎస్పీ, ప్రాంగణాన్ని వివిధ సెక్టార్లుగా విభజించి ఆయా సెక్టార్ ఇన్‌చార్జిలకు బాధ్యతలు వివరించారు. రాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి భద్రతా లోపాలకు తావు లేకుండా అత్యంత అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, అధికారులు, సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రోటోకాల్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.
సమావేశంలో తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి, అదనపు ఎస్పీలు ఎం. నాగభూషణం, ఇలియాస్ బాషా, పలువురు డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
