గర్భిణీలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

చౌటుప్పల్‌లో గర్భిణులకు అవగాహన సదస్సు

చౌటుప్పల్, ఆంధ్రప్రభ: గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రముఖ సంతానోత్పత్తి నిపుణురాలు డాక్టర్‌ ఈ. ప్రశాంతి రెడ్డి సూచించారు. లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ చౌటుప్పల్‌ సేవ ఆధ్వర్యంలో మంగళవారం తంగడపల్లి రోడ్డులోని కళాశ్రీ ఫంక్షన్‌ హాల్‌లో గర్భిణులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా వైద్యులు డాక్టర్‌ వై. సూర్యశ్రీ, డాక్టర్‌ అవ్వారు శ్రీనివాస్‌ ప్రసాద్‌తో కలిసి డాక్టర్‌ ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ.. గర్భిణులు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, క్యాల్షియం వంటి అవసరమైన మందులతో పాటు పౌష్టికాహారం తీసుకోవాలని తెలిపారు. సురక్షితమైన తాగునీరు, పరిశుభ్రమైన వాతావరణం, తగిన విశ్రాంతి గర్భిణులకు ఎంతో అవసరమని పేర్కొన్నారు.

అధిక రక్తపోటు, తీవ్రమైన తలనొప్పి, కాళ్ల వాపులు, రక్తస్రావం, చూపు మసకబారడం, బిడ్డ కదలికలు తగ్గడం వంటి ప్రమాదకర లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. సురక్షిత ప్రసవం, తల్లి-బిడ్డల ఆరోగ్య సంరక్షణలో కుటుంబ సభ్యుల సహకారం ఎంతో కీలకమని తెలిపారు.

క్లబ్‌ అధ్యక్షుడు ఎండీ అతహర్‌ పాషా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ దాచేపల్లి ప్రకాష్‌, నల్లగొండ జిల్లా రీజియన్‌ చైర్‌పర్సన్‌ సంజీవరెడ్డి, జోన్‌ చైర్మన్‌ ఉప్పు ఆంజనేయులు, క్లబ్‌ కార్యదర్శి దాచేపల్లి రాజు, కోశాధికారి బత్తిని రఘు, సభ్యులు నాంపల్లి రమేష్‌, తిరందాసు జగన్నాథ్‌, కాసుల వెంకటేశం, కామిశెట్టి చంద్రశేఖర్‌, గోపగోని లక్ష్మణ్‌, దేవరపల్లి గోవర్ధన్‌రెడ్డి, సిలివేరు మంగయ్య, వనం రాజు, సంపూర్ణాచారి, పోలోజు రాజు, పోలోజు శ్రీనివాసాచారి, అంగన్‌వాడీ ఉపాధ్యాయులు, గర్భిణులు పాల్గొన్నారు.